సీఎంకి మోదీ అభయం!
► అన్నాడీఎంకే ఇరు శిబిరాల్లో ఆనందం
► ఇక, చర్చల కసరత్తు
► త్వరలో ఒకే వేదిక మీదకు
► పన్నీరుకు అధ్యక్ష పదవి
► సీఎంగా పళని కొనసాగింపు
►ప్రధానితో సీఎం భేటీ
ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అనంతరం అన్నాడీఎంకే అమ్మ, పురట్చి తలైవి శిబిరాలు ఆనందంలో మునిగి ఉన్నాయి. మోదీ ఆదేశానుసారం ఇక, చర్చలతో ఒకే వేదిక మీదకు ఇరు శిబిరాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్నాడీఎంకే మార్గదర్శక కమిటీకి అధ్యక్షుడిగా పన్నీరును నియమించి, సీఎంగా పళనిస్వామి కొనసాగింపునకు తగ్గ ప్రణాళిక సిద్ధం అవుతున్నట్టు తెలిసింది.
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలోని పళని, పన్నీరు వర్గాలు విలీనమై ముందుకు సాగేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రాజీ కుదిర్చినట్టు సమాచారం. అన్నాడీఎంకే రాజకీయం ఢిల్లీ చేరిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీతో పురట్చి తలైవి శిబిరం నేత పన్నీరు సెల్వం నేతృత్వంలోని బృందం సోమవారం భేటీ అయింది. ఉప రాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడుతో పాటుగా పలువురు ఢిల్లీ పెద్దలతో ఈ బృందం భేటీ సాగించి ఆనందంగా చెన్నైలో అడుగు పెట్టింది. ఇక, మంగళవారం ఉదయం సీఎంతో సీఎం భేటీ సాగడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అర గంటకు పైగా సాగిన భేటీ అనంతరం ఉత్సాహంగానే సీఎం బయటకు రావడం గమనార్హం. తదుపరి తన ఎంపీలతో కలసి ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్య నాయుడుతో భేటీ కావడం, తమ మద్దతు ప్రకటించడం చోటుచేసుకున్నాయి.
త్వరలో విలీనం?
ప్రధాని నరేంద్ర మోదీ అటు పన్నీరు సెల్వంకు, ఇటు పళని స్వామికి తన అభయాన్ని ఇచ్చినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. అన్నాడీఎంకేలో సాగుతున్న పరిణామాలకు ముగింపు పలికి, ఇరు శిబిరాలు ఒకే వేదికగా పనిచేయడానికి తగ్గ సూచనను ప్రధాని ఇచ్చినట్టు సమాచారం. మోదీ సూచన మేరకు ఇరు శిబిరాలు త్వరలో ఒకే వేదిక మీదకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చర్చల ద్వారా ఇరు శిబిరాలు ఏకం అయ్యేందుకు తగ్గ ప్రణాళికను సిద్ధం చేసుకునే పనిలో పడటం గమనార్హం. పన్నీరు శిబిరం చెన్నై చేరుకోగానే, అన్ని మంచే జరుగుతుందన్నట్టుగా స్పందించడం ఆలోచించాల్సిందే.
ఇక, పళని శిబిరం తమిళనాడుకు అనుకూలంగా పీఎం అన్నీ.. మంచి నిర్ణయాలను తీసుకుంటారని వ్యాఖ్యానించారు. ఈ దృష్ట్యా, మోదీ మార్గదర్శకంలో ఇరు శిబిరాలు ఏకమయ్యే రీతిలో, అన్నాడీఎంకే ఒకే వేదికగా సాగే విధంగా మార్గదర్శక కమిటీ ఏర్పాటుచేసే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారాలు వెలువడుతున్నాయి. ఈ కమిటీకి అధ్యక్షుడిగా పన్నీరు సెల్వం వ్యవహరించడం, సీఎంగా పళని స్వామి కొనసాగే రీతిలో కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నట్టు తెలిసింది. బీజేపీకి అనుకూలంగా వ్యవహరించడం, కేంద్ర పథకాలను తమిళనాట విస్తృతం పరిచే విధంగా తగ్గ సూచనల్ని మోదీ ఇచ్చినట్టు సమాచారం. ఇక, తమిళనాట నీట్ మినహాయింపునకు ఈ సారికి చర్యలు తీసుకోవాలని ప్రత్యేకంగా పళని విజ్ఞప్తికి పరిశీలిస్తామన్న హామీని ప్రధాని ఇవ్వడం గమనార్హం.
సీఎంతో అయ్యాకన్ను
ఢిల్లీ వేదికగా ఆందోళనలు చేస్తున్న తమిళ రైతులు సీఎం పళని స్వామితో భేటీ అయ్యారు. జంతర్ మంతర్ వేదికగా రైతుల పోరాటం సాగుతున్న విషయం తెలిసిందే. ఈ రైతులు తమిళనాడు భవన్ వద్ద ఉదయాన్నే బైఠాయించారు. దీంతో ఆ ఉద్యమ నేత అయ్యాకన్నును లోనికి పిలించి సీఎం పళని స్వామి భేటీ అయ్యారు. రైతు సమస్యలపై కేంద్రం పెద్దలతో సంప్రదింపులు జరపాలని అయ్యాకన్ను విజ్ఞప్తి చేసినా, సీఎం పళని అందుకు తగ్గ ప్రయత్నాలు చేసిన దాఖలాలు శూన్యం.