
గవర్నర్‌గా శంకరమూర్తి?
సాక్షి ప్రతినిధి, చెన్నై: కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నపుడు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కే రోశయ్యను తమిళనాడు గవర్నర్‌గా నియమించారు. సహజంగా కేంద్రంలో మరోపార్టీ అధికారంలోకి రాగానే గవర్నర్ల సీటుకు కాలం చెల్లుతుంది. గవర్నర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేయడమో లేదా కేంద్రమే తొలగించడమో రాజకీయాల్లో సహజం. అయితే ముఖ్యమంత్రి జయలలితతో సత్సంబంధాలు, వివాదరహితుడు కావడంతో రోశయ్య మరో రెండేళ్లు కొనసాగి మొత్తం ఐదేళ్లపాటూ పూర్తికాలం గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
2011 ఆగస్టులో రోశయ్య బాధ్యతలు చేపట్టగా ఈనెల 27వ తేదీతో ఆయన పదవీకాలం ముగుస్తుంది. బీజేపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి పదవుల కోసం క్యూకట్టిన వారిని సంతృప్తిపరచాల్సిన ఆవశ్యకత కేంద్రానికి ఏర్పడింది. దీంతో కొత్త గవర్నర్‌గా ఎవరు వస్తారనే అంశం ఇటీవల తీవ్రస్థాయిలో చర్చకు వచ్చింది. ముఖ్యంగా ఉత్తరాదివారా, దక్షిణాది వ్యక్తా అనే కోణంలో రెండుగా విభజించి విశ్లేషించుకోవడం ప్రారంభించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తెలుగుదేశం మిత్రపక్షం కావడంతో ఆ పార్టీకి చెందిన ఒక పేరు పెద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. అయితే ఈలోగా కేంద్రంతో తెలుగుదేశానికి సంబంధాలు చెడడంతో కొత్త పేర్లు తెరపైకి వచ్చాయి. గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి ఇటీవలే రాజీనామా చేసిన ఆనందీబెన్ పేరు కూడా కొన్నాళ్లు చలామణి అయింది. బీజేపీ సీనియర్ నేత టీహెచ్ శంకరమూర్తిని పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షా పిలిచి త్వరలో మీకు పెద్ద కొత్త పదవి రాబోతోంది, సిద్ధంగా ఉండండి అని చెప్పారు.
ఆ పదవి ఉత్తరాదిలో కాకుండా దక్షిణాదిలో ఉండేలా చూడాలని శంకరమూర్తి కోరినట్లు సమాచారం. దక్షిణాదికి సంబంధించి తమిళనాడు గవర్నర్ స్థానం ఖాళీ అవుతోంది. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు నరసింహన్ ఒక్కరే గవర్నర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో దేనికైనా గవర్నర్‌గా నియమించే అవకాశం ఉందని కూడా వినపడుతోంది. అయితే తమిళనాడు గవర్నర్‌గా నియమించేందుకే అమిత్‌షా నిర్ణయించినట్లు సమాచారం.