తమిళి సై టీం రెడీ
* కార్యవర్గం ప్రకటన
* వానతికి ఉపాధ్యక్ష పదవి
* ప్రధాన కార్యదర్శిగా మోహన్‌రాజు
సాక్షి, చెన్నై : రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ తన టీంను సిద్ధం చేసుకున్నారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గాన్ని తమిళి సై ప్రకటించారు. వానతీ శ్రీనివాసన్‌కు ఉపాధ్యక్ష పదవి, ఎస్ మోహన్‌రాజు ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచి కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కించుకున్న పొన్ రాధాకృష్ణన్ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కొన్ని నెలల అనంతరం ఎట్టకేలకు ఆ పదవి తమిళి సై సౌందరరాజన్‌ను వరించింది. పార్టీలకు అతీతంగా అందరూ ఆహ్వానించారు.
పార్టీ కోసం ఏళ్ల తరబడి ఆమె సాగించిన సేవకు ప్రతి రూపంగా పార్టీ నాయకత్వ పగ్గాలు దక్కాయని చెప్పవచ్చు. అయితే, ఆమెను అధికార పూర్వకంగా అధ్యక్షురాలిగా ఆమోదించేందుకు మరి కొన్ని నెలలు పట్టాయి. ఎట్టకేలకు రెండు రోజుల క్రితం జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆమెను అధ్యక్షురాలిగా ఆమోదిస్తూ తీర్మానించారు. దీంతో తమిళి సై టీం ఎలా ఉండబోతోందోనన్న ఎదు రు చూపులు పెరిగాయి. రాష్ట్రంలో అధికార పగ్గాలు లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీజేపీకి రాష్ట్ర కార్యవర్గం మరింత బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. దీంతో తన టీం ఎంపికపై తీవ్ర కసరత్తులు చేసిన తమిళి సై ఎట్టకేలకు శుక్రవారం రాష్ట్ర కార్యవర్గ జాబితాను ప్రకటించారు.
కొత్త టీం
బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో అధ్యక్షురాలితో పాటుగా తొమ్మిది మంది ఉపాధ్యక్షులు, నలుగురు ప్రధాన కార్యదర్శులు, తొమ్మిది మంది కార్యదర్శుల్ని నియమించారు. కోశాధికారి, రాష్ట్ర కార్యాలయ కార్యదర్శిగా ఒకర్ని నియమించారు. ఆ జాబితా మేరకు ఉపాధ్యక్షులుగా - వానతీ శ్రీనివాసన్, శుభ నాగరాజన్, కరుప్పు ఎం.మురుగానందన్, డీ.కుప్పురాము, ఎం.చక్రవర్తి, ఎస్.సురేంద్ర, ఎం.సుబ్రమణి, శివగామి పరమశివం, తమిళరసి యోగంను నియమించారు.
ప్రధాన కార్యదర్శులుగా ఎస్.మోహన్‌రాజులు(నిర్వాహక), ఎస్‌ఆర్.శరవణ పెరుమాళ్, కేఎస్.నరేంద్రన్, జీకేఎస్.సెల్వకుమార్, కార్యదర్శులుగా ఎస్.పళనిస్వామి, ఎస్.ఆదవన్, కె.టి.రాఘవన్, పొన్ బాలగణపతి, సీ.ధర్మరాజు, బి.జి.మోహన్‌రాజు, మహాలక్ష్మి, గిరిజ, మనోహరన్, అనుచంద్రులు వ్యవహరించనున్నారు. రాష్ట్ర కోశాధికారిగా ఎస్‌ఆర్ శేఖర్, పార్టీ కార్యాలయ కార్యదర్శిగా కే.సర్వోత్తమన్‌లనునియమించారు. కాగా కన్యాకుమారి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ధర్మరాజును రాష్ట్ర కార్యదర్శిగా నియమించడంతో ఆయన స్థానంలో ఆ జిల్లా అధ్యక్షుడుగా ధర్మపురం తిరుగణేషన్ వ్యవహరించనున్నారు.