
'మోదీని తిట్టకపోతే టీడీపీ ఊరుకునేలా లేదు'
హైదరాబాద్: జై ఆంధ్రప్రదేశ్ సభను అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఎన్నో కుతంత్రాలు చేసిందని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. ఎన్ని ఆటంకాలు కల్పించినా సభను ప్రజలు విజయవంతం చేశారని చెప్పారు. సభను విజయవంతం చేసినందుకు ప్రజలకు వైఎస్సార్ సీపీ తరపున ధన్యవాదాలు తెలిపారు.
పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... జై ఆంధ్రప్రదేశ్ సభ ద్వారా తమ వేదనను ఉత్తరాంధ్ర ప్రజలు వినిపించారని చెప్పారు. విశాఖ సభ విజయవంతం కావడాన్ని అధికార టీడీపీ నాయకులు తట్టుకోలేకపోతున్నారని అన్నారు. విశాఖలో ఇంతకుముందెన్నడూ ఇంతపెద్ద సభ జరగలేదని ప్రజలు ఆశ్చర్యపోతున్నారని చెప్పారు. ప్రత్యేక హోదాపై ప్రజలను వైఎస్ జగన్ చైతన్యవంతులను చేస్తున్నారని తెలిపారు.
తెల్లారకముందే ఓ మంత్రి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వైఎస్ జగన్ పై విమర్శలు చేస్తున్నారని అన్నారు. విశాఖ సభలో ప్రధాని నరేంద్ర మోదీని ఎందుకు తిట్టలేదని సదరు మంత్రి ప్రశ్నించడం శోచనీయమన్నారు. మోదీని తిట్టకపోతే టీడీపీ అంగీకరించే పరిస్థితి లేదని దీని ద్వారా స్పష్టమవుతోందని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వేదికగా హోదా కోసం వైఎస్ జగన్ చేసిన పోరాటం గుర్తుకురావడం లేదా అని భూమన ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం ఎవరితోనైనా తలపడేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. హోదా సాధించలేకపోయినందుకు ప్రజలకు చంద్రబాబు సర్కారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.