తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పొడిగింపు
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జనవరి 11 వరకు పొడిగించారు. శుక్రవారం జరిగిన బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జనవరి 3, 4, 5, 6, 9, 10, 11 తేదీల్లో సమావేశాలు జరగనున్నాయి. సమావేశాలను పొడిగించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించినట్టు చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ తెలిపారు. అసెంబ్లీ లో విపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదనేది అవాస్తవమని ఆయన తెలిపారు. కాంగ్రెస్ 12 గంటల 36 నిమిషాల సమయం వినియోగించుకుందని, టీఆర్‌ఎస్ 9 గంటల సమయాన్ని వినియోగించుకుందన్నారు. భూ సేకరణ చట్టం ఆమోదించిన తర్వాత కాంగ్రెస్ సభ నుంచి పారిపోవడం విచారకరమన్నారు. కాంగ్రెస్ కోరుకున్న పెద్దనోట్ల రద్దు, డబుల్ బెడ్ రూమ్ అంశాలపై ఇప్పటికే చర్చించామన్నారు.
విపక్షం ఒకటి అడిగితే తాము పది సమాధానాలు ఇచ్చామన్నారు. కాంగ్రెస్ కు లేవనెత్తేందుకు అసలు సమస్యలు లేవని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలు పొడిగిస్తున్నామని సీఎం కేసీఆర్ ప్రతిపాదిస్తే కాంగ్రెస్ నేతలు తెల్ల మొహం వేశారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సమావేశాలు ఇంత సజావుగా జరగడం ఇదే మొదటిసారని తెలిపారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ శతవిధాలా యత్నించినప్పటికీ తమ సర్కార్ ఎక్కడా చిక్కలేదన్నారు. కనీసం 3 వ తేది నుంచి జరిగే సమావేశాల్లో నైనా హుందాగా వ్యవహరించాలని, కాంగ్రెస్ ఏ అంశాన్ని లేవనెత్తినా ధీటుగా బదులిస్తామని తెలిపారు. కాగా జనవరి 3 న మత్స్య సంపద అభివృద్ది, 4 న బోధన రుసుములు, 5న సింగరేణి, 6న ఎస్సీ, ఎస్టీల ఆర్తిక స్థితిగతులు తదితర అంశాలపై చర్చించనున్నారు.