నోటికొచ్చిన హామీలివ్వడం సరికాదు: గట్టు
ఎన్నికల సందర్భంలో అధికారమే పరమావధిగా నోటికొచ్చిన హామీలివ్వడం సరికాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.
హుజూర్‌నగర్: ఎన్నికల సందర్భంలో అధికారమే పరమావధిగా నోటికొచ్చిన హామీలివ్వడం సరికాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేపట్టిన మహాజన పాదయాత్రకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా గట్టు మాట్లాడుతూ టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా ఎన్నికల హామీలను అమలు చేయలేదని విమర్శించారు.
దళితులకు మూడెకరాల భూమి, రెండు పడక గదుల ఇళ్లు, గిరిజన తండాలను పంచాయతీలుగా ఏర్పాటు, ఎస్టీ, మైనార్టీల రిజర్వేషన్లు తదితర హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని నిరుద్యోగుల ఓట్లు దండుకున్నారే తప్ప నోటిఫికేషన్లు, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరగడం లేదన్నారు. సామాజిక న్యాయం ప్రధాన ఎజెండాగా సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర రాష్ట్ర ప్రజలకు దిశ నిర్ధేశించేదిగా ఉందని తెలిపారు.