హైదరాబాద్: కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగుల ఆశలు అడియాసలే అయ్యాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడితే లక్షకుపైగా ఉద్యోగాలు వస్తాయని భావించి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారన్నారు. కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు గడిచినా ఉద్యోగాల భర్తీ చేయడంలేదని విమర్శించారు.
ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పోలీస్ శాఖతో పాటు వివిధ కార్పొరేషన్లలో కొన్ని ఉద్యోగాలే భర్తీ చేసిందని... రెవెన్యూ, విద్యా, వైద్యారోగ్య, వ్యవసాయ శాఖల్లో కొలువులు భర్తీ చేయకుండా నిరుద్యోగులకు మొండిచేయి చూపిస్తోందన్నారు. క్యాలెండర్ ఇయర్ ప్రకటిస్తామని ప్రగల్బాలు పలికిన కేసీఆర్ ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తడం లేదని గట్టు అన్నారు.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకనే గ్రూప్–2, గురుకుల పరీక్షల్లో తప్పిదాలు జరిగాయన్నారు. టీఎస్‌పీఎస్సీ పొరపాట వల్లే నిరుద్యోగులు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందన్నారు. గత నాలుగేళ్లలో విడుదల చేసిన ఉద్యోగాల నోటిఫికేషన్లపై, ప్రస్తుత ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment