రాచ నగరిలో ఉద్రిక్తత | tension in the racha Nagari | Sakshi
Sakshi News home page

రాచ నగరిలో ఉద్రిక్తత

Published Tue, Mar 15 2016 2:02 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

రాచ నగరిలో ఉద్రిక్తత - Sakshi

రాచ నగరిలో ఉద్రిక్తత

= ‘రాజు’కున్న మైసూరు !
= ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త హత్యతో నగరంలో బంద్‌కు పిలుపు
= పలు వాహనాలకు నిప్పు
= పోలీసులపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు
= నగరంలో 144 సెక్షన్ అమలు
= భారీగా తరలివచ్చిన బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు

 
మైసూరు :  బీజేపీ నేత హత్యతో రాచనగరి మైసూరు సోమవారం అట్టుడికింది. ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు, మైసూరుకు చెందిన బీజేపీ నేత క్యాతమారనహళ్లి రాజు (33) హత్య ఉదంతం నేపథ్యంలో రాచనగరి మైసూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజు హత్యకు నిరసనగా బీజేపీ మైసూరు నగర బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆందోళనకారులు బస్సులు, పోలీసుల వాహనాలపై సైతం రాళ్లు రువ్వడంతో చాలా మందికి గాయాలయ్యాయి. దీంతో మైసూరు నగరంలో 144 సెక్షన్‌ను విధించారు. వివరాలు... ఆర్‌ఎస్‌ఎస్‌తో పాటు బీజేపీ నాయకుడైన క్యాతమారనహళ్లి రాజును ఆదివారం రాత్రి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాచనగరి మైసూరులో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నేతలు బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్ నేపథ్యంలో మైసూరు మహా నగరం సోమవారం ఒక్కసారిగా
 హింసాత్మకంగా మారింది. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నేతలు రోడ్లపైకి వచ్చి నగరంలో ఉన్న దుకాణాలను బలవంతంగా మూసి వేశారు. తెరిచి ఉన్న దుకాణాల పైన దాడులు చేశారు. మైసూరు నగరంలో ఎక్కడ చూసినా ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు జెండాలను పట్టుకొని దాడులకు దిగారు.   నగరంలోని గ్రామీణ బస్ డిపోవద్దకు చేరుకుని బస్సులను అడ్డుకున్నారు. బయటికి వచ్చిన బస్సులపైన రాళ్లు రువ్వారు. ఈ ప్రమాదంలో ఒక ప్రైవేట్ బస్సుతో సహా మూడు ప్రభుత్వ బస్సుల పైన రాళ్లు రువ్వడంతో అద్దాలు పూర్తిగా ధ్వంసం చేశారు.

అనంతరం కార్యకర్తలు ర్యాలీగా మైసూరు నగరంలో ఉన్న మెడికల్ కాలేజీ ఆవరణం చేరుకొని మార్చురీలో ఉన్న రాజు మృతదేహం వద్దకు వెళ్లడానికి ప్రయత్నించగా   పోలీసులు వారిని అడ్డుకున్నారు. కార్యకర్తలు బారికేడ్లను తోసుకుంటూ పెద్ద ఎత్తున ముందుకు వచ్చారు. మరికొంత మంది కార్యకర్తలు ఎన్.ఆర్ మోహల్లా సర్కిల్ సమీపంలో బైక్‌కు నిప్పు అంటిచారు. విషయం తెలుసుకున్న పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పోలీసులను చూసిన కార్యకర్తలు వారిపై రాళ్లు రువ్వారు. రాళ్ల దాడిలో పోలీసుల గరుడ వాహనం ధ్వంసమైంది. దాంతో కార్యకర్తలపైన పోలీసులు లాఠీలను ఝులిపించారు. కొంత మంది గాయపడ్డారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు సోమవారం అర్ధరాత్రి వరకు నగరంలో 144 సెక్షన్ విధించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే ఆస్పత్రిలో ఉన్న రాజు మృత దేహాన్ని సందర్శించిన బీజేపీ ప్రముఖ నాయకులు సీటీ రవి, రామదాసు, పార్లమెంట్ సభ్యుడు ప్రతాప్‌సింహ, మరికొంతమంది నాయకులు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వె ళ్లి కలెక్టర్ శిఖాను కలిసి చర్చలు జరిపారు. బీజేపీ నాయకులు కలెక్టర్ ముందు మూడు డిమాండ్లను తెలిపారు.

హత్యకు గురైన రాజు కుటుంబ సభ్యులకు రూ. 25 లక్షల పరిహారం ఇవ్వాలని, రాజు హత్య చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి వారికి కఠిన శిక్ష విధించాలని, హత్య జరిగిన స్థలం వద్ద ఉన్న ప్రార్థన మం దిరం వివాదంలో ఉందని ప్రకటించాలని కలెక్టర్‌ను డిమాండు చేశారు. దాంతో కలెక్టర్ బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి తక్షణ పరిహారం రూ.5 లక్షలు ఇప్పిస్తామని హామి ఇచ్చారు. మరోవైపు మధ్యాహ్నం నగరంలో ఉన్నదేవరాజు మార్కెట్‌లోకి ప్రవేశించిన కార్యకర్తలు అక్కడ ఉన్న పూల దుకాణాలు, కూరగాయలు, పండ్లు దుకాణలను మూసివేయించారు.   కేఆర్ ఆస్పత్రి సమీపంలో మరి కొంత మంది ఆందోళకారులు ఆటోకు నిప్పు పెట్టారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. మధ్యాహ్నం మూడు గంటలకు పైన రాజు మృతదేహాన్ని కార్యకర్తలు వాహనంలో ఊరేగింపుగా క్యాతమారనహళ్లిలో ఉన్న రాజు ఇంటి వద్దకు తీసుకువచ్చారు. సాయంత్రంరాజు అంత్యక్రియలు నిర్వహించారు.
 
నిందితల కోసం  నాలుగు బృందాలు

మైసూరు నగరంలో ఉన్న ఉదయగిరిలో ఆదివారం బీజేపీ నాయకుడు రాజును  హత్య చేసిన వారిని పట్టుకోవడం కోసం నాలుగు ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు. హత్య జరిగిన స్థలంలో ఉన్న సీసీటీవీల ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నామని నగర పోలీస్ కమిషనర్ దయానంద్ వెల్లడించారు.  

పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబం....
రాజు హత్య నేపథ్యంలో ఆయన కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. రాజు హత్యకు గురి అయ్యాడన్న విషయం తెలుసుకున్న కుటుంబ స భ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. క్యాతమారనహళికి చెందిన మాదప్ప, చెంద్రమ్మ దంపతుల కుమారుడు రాజు అవివాహితుడు. తండ్రి మరణించారు. ప్రస్తుతం కుటుంబానికి రాజు పెద్ద దిక్కులా ఉంటూ కుటుంబాన్ని తానే చూసుకుంటున్నాడు.
  విద్యుత్ కాంట్రాక్టర్‌గా ఉన్నరాజుకు తల్లి, ముగ్గురు అక్క చెల్లెల్లు ఉన్నారు. రాజు హత్య విషయం తెలుసుకున్న మాజీ మంత్రులు సీ.టి.రవి, ఎస్.రామదాసు, ఎంపి. ప్రతాప్ సింహ,  సీహెచ్. విజయ్‌శంకర్‌లు రాజు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్య్యులను పరార్శించారు. పార్టీ నుంచి రూ. 5 లక్షలు, మైసూరు హోటల్ యజమానుల సంఘం నుంచి ఐదు లక్షల పరిహారం అందిస్తామని కటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement