తీవ్రవాదుల టార్గెట్ ‘మోదీ’
సాక్షి, చెన్నై : బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ బహిరంగ సభ విచ్చిన్నం లక్ష్యం గానే గుహవాటి ఎక్స్‌ప్రెస్‌లో బాం బులు అమర్చినట్టు తీవ్రవాదుల వద్ద జరిపిన విచారణలో వెలుగు చూసింది. ఈ మేరకు పట్టుబడిన తీవ్రవాదుల వద్ద బెంగళూరులో తీవ్ర విచారణ సాగుతోంది. మరి కొన్ని రోజుల్లో వీరిని చెన్నైకు తీసుకొచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో ఈ ఏడాది మే ఒకటో తేదీ పేలుడు జరిగిం ది. బెంగళూరు నుంచి వచ్చిన గుహవాటి ఎక్స్‌ప్రెస్‌లో చోటు చేసుకున్న ఈ పేలుళ్ల కేసును ఓ సవాల్‌గా తీసుకున్న సీబీసీఐడీ విచారణను నెలల తరబడి సాగిస్తోంది.
ఈ పరిస్థితుల్లో బెంగళూరులో రెండు రోజుల క్రితం ముగ్గురు తీవ్రవాదులు పట్టుబడడం, వారికి ఈ కేసుకు సంబంధం ఉన్న సమాచారం వెలుగులోకి వచ్చింది. దీంతో చెన్నై నుంచి సీబీసీఐడీ డీఎస్పీలు విజయరాఘవన్, ఆనందకుమార్ బెంగళూరు వెళ్లారు. అక్కడ కర్ణాటక పోలీసులతో కలసి విచారణలో నిమగ్నం అయ్యారు. ఆ తీవ్రవాదులు పట్టుబడ్డ ధర్వార్ నగర్ పరిసరాల్లో విచారణ జరుపుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. అయి తే, ఆ ముగ్గురు తీవ్రవాదులు అన్న సమాచారంతో ఆ పరిసరవాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుండడం గమనార్హం. ఎప్పుడు ఏం జరుగుతుందోనని వణికిపోతున్నారు.
మోదీ టార్గెట్
ఆ తీవ్రవాదుల చెప్పిన వివరాల మేరకు ఆ పేలుళ్లు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేష న్‌ను టార్గెట్ చేయలేదన్న విషయం స్పష్ట అవుతోంది. ఇదే విషయాన్ని ఘటన జరిగిన సందర్భంలో అప్పటి డీజీపీ రామానుజం సైతం వ్యాఖ్యానించారు. రైలు ఆలస్యంగా రావడం వల్లే ఇక్కడ పేలిందని, లేకుంటే ఆంధ్రప్రదేశ్ వైపుగా రైలు పరుగులు తీస్తున్న సమయంలో పేలుడు జరిగి ఉండేదన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. తాజాగా తీవ్ర వాదులు సైతం ఇదే విషయాన్ని వెల్లడించారు. ఘటన జరిగిన రోజు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పర్యటనలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ ఉన్న విషయం తెలిసిందే. నెల్లూరు సభకు ఏర్పాట్లు చేసి ఉన్న దృష్ట్యా, ఆ సభ విచ్చిన్నం లక్ష్యంగా ఈ పేలుడుకు వ్యూహ రచన జరిగినట్టు గతంలో వ్యక్తమైన అనుమానాలు తాజా విచారణలో నిజమయ్యూయి.
మోదీని టార్గెట్ చేసి గుహవాటి ఎక్స్‌ప్రెస్‌లో టైమర్లను అమర్చిన ఈ ముగ్గురు తీవ్ర వాదులు నిషేదిత ‘సిమి’కి చెందిన వాళ్లుగా తేల్చారు. సిమి కార్యకలాపాలు చాప కింద నీరు లా రాష్ట్రంలో సాగుతుండడం ఇటీవల వెలుగు చూసిన దృష్ట్యా, ఈ కేసుకు సహకరించిన వాళ్లెవ్వరైనా ఇక్కడ నక్కి ఉన్నారా..? అన్న అనుమానాలు మొదలయ్యూయి. ఆ ముగ్గురినీ త్వరితగతిన తమ కస్టడీకి తీసుకునే చర్యల్ని సీబీసీఐడీ డీఎస్పీలు వేగవంతం చేశారు. మరి కొన్ని రోజుల్లో వారిని చెన్నై తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు.