పాఠశాలకు సెలవు ఆమె పాలిట మృత్యువైంది. కంటి రెప్పలా కాపాడుతాడనుకున్న తండ్రే కాలయముడయ్యాడు.
బెంగళూరు, న్యూస్‌లైన్ : పాఠశాలకు సెలవు ఆమె పాలిట మృత్యువైంది. కంటి రెప్పలా కాపాడుతాడనుకున్న తండ్రే కాలయముడయ్యాడు. పాశావికంగా కన్న తండ్రే దాడి చేస్తుంటే తప్పించుకోలేని అసహస్థితిలో ప్రాణాలు కోల్పోయింది. విగతజీవిలా పడి ఉన్న కూతురిని గమనించి బెంబేలెత్తిన ఆ కిరాతకుడు చివరకు ఆత్మహత్యాయత్నం చేశాడు.
పరప్పన అగ్రహార పోలీసుల సమాచారం మేరకు ... తమిళనాడులోని వేలూరుకు చెందిన బాలరాజు(38), కవిత దంపతులు. ఏడేళ్ల క్రితం బెంగళూరు చేరుకుని పరప్పన అగ్రహార సమీపంలోని ద్వారకానగరలో నివాసముంటున్నారు. వీరికి హేమలత(12) అనే కూతురు ఉంది. ఈమె అక్కడికి సమీపంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో ఆరవ తరగతి చదువుతోంది. ఏడాది క్రితం వరకు సెక్యూరిటీ గార్డుగా బాలరాజు పనిచేసేవాడు. తర్వాత మానసిక అస్వస్థతకు గురికావడంతో ఇంటిలోనే ఉంటున్నాడు.
ఇతనికి వేలూరులో చికిత్స అందిస్తున్నారు. కుటుంబ పోషణ కోసం ఓ ప్రైవేట్ కంపెనీలో హౌస్ కీపింగ్ సూపర్‌వైజర్‌గా కవిత పనిలో చేరింది. ఎప్పటిలాగే మంగళవారం ఉదయం కవిత ఉద్యోగానికి వెళ్లింది. స్కూల్‌కు సెలవు కావడంతో హేమలత, తన తండ్రి వద్దే ఉంది. ఆ సమయంలో బాలరాజు విచిత్రంగా ప్రవర్తిస్తూ కూతురిపై దాడి చేసి ఉరి వేసేందుకు ప్రయత్నించాడు. అతని చర్యలను ఆమె ప్రతిఘటించడంతో మూటకట్టి పెట్టిన పాత ఫ్యాన్‌తో హేమలత తలపై బాది హతమార్చాడు.
కొద్ది సేపటి తర్వాత రక్తపు మడుగులో పడి ఉన్న కూతురిని చూసి బెంబేలెత్తిన అతను విషం తాగి పడిపోయాడు. మధ్యాహ్నం కవిత తన భర్త మొబైల్‌కు ఫోన్ చేసింది. స్పందన లేకపోవడంతో అదుర్దాగా ఇంటికి చేరుకుంది. అక్కడ కుమార్తె రక్తపు మడుగులో పడి ఉండడం, ఆ పక్కనే అపస్మారక స్థితిలో పడి ఉన్న భర్తను గమనించి గట్టిగా కేకలు వేసింది. చుట్టుపక్కల వారు చేరుకుని ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే హేమలత మరణించిందని వైద్యులు ధ్రువీకరించారు. విక్టోరియా ఆస్పత్రిలో బాలరాజుకు చికిత్స అందిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు.