అప్రకటిత ఎమర్జెన్సీ
Published Wed, Oct 16 2013 12:36 AM | Last Updated on Tue, Aug 21 2018 5:44 PM
న్యూఢిల్లీ: ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు షీలా సర్కార్ ఢిల్లీలో అప్రకటిత ఎమర్జెన్సీని కొనసాగిస్తోందని బీజేపీ ఆరోపించింది. నగరంలో వెలిసిన నరేంద్ర మోడీ హోర్డింగ్‌లను తొలగించడం, ఇష్టమొచ్చినట్టుగా స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో)లను బదిలీ చేయడంతో పాటు ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలను వేధించేందుకు పోలీసులను వినియోగించుకుంటుండటమే ఇందుకు నిదర్శనమని బీజేపీ అధికార ప్రతినిధి మీనాక్షి లేఖి విమర్శించారు. ఢిల్లీ పార్టీ కార్యాలయంలో ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడారు.
షీలా సర్కార్‌కు మోడీ ఫోబియా పట్టుకుందన్నారు. కేవలం 19 మంది ఎస్‌హెచ్‌వోలను బదిలీ చేయాల్సి ఉండగా, నగరవ్యాప్తంగా 40 మంది ఎస్‌హెచ్‌వోలను ఆగమేఘాల మీద బదిలీ చేసిందన్నారు. దీని వెనుక మర్మమేమిటని ఆమె ప్రశ్నించారు. ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించడంలో ఎన్నికల కమిషన్ విఫలమవుతోందని విమర్శించారు. అవసరం లేకున్నా 21 మంది ఎస్‌హెచ్‌వోలను బదిలీ చేసిన షీలా సర్కార్‌పై ఈసీ చర్యలు తీసుకోకపోతే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకే ఈ విధానానికి షీలా సర్కార్ శ్రీకారం చుట్టిందన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఢిల్లీ పోలీసు రాష్ట్రంగా మారిందని, బీజేపీ కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ చర్యలు తీసుకోవడం లేదని విరుచుకుపడ్డారు. షీలా సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలపై చర్యలు లేకపోవడంతో పోలీసులు, కాంగ్రెస్, ఎన్నికల కమిషన్‌లు కుమ్మక్కయ్యారనే విషయం అర్థమవుతోందన్నారు. తమ పార్టీ ప్రధాని అభ్యర్థి మోడీ హోర్డింగ్‌లను పెట్టేందుకు స్థానిక సంస్థలకు ఫీజులు చెల్లించామని, అయినా అధికార పార్టీ అండదండలతో పోలీసులు వాటిని తొలగిస్తున్నారని విమర్శించారు. ఈ విషయమై ఇప్పటికే ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి విజయ్ దేవ్‌కు ఫిర్యాదు చేశామన్నారు. ఒకవేళ కమిషన్ చర్యలు తీసుకోకపోతే వారి పక్షపాత వైఖరిని ఎండగడతామన్నారు.
ప్రతి కుటుంబాన్ని , ప్రతి ఒక్కరిని తమ ప్రచారం చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించకుండా బీజేపీ అధికారంలోకి వస్తే చేయబోయే అభివృద్ధి, సంక్షేమ పనులనే ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించినట్టు తెలిపారు. అదే సమయంలో 15 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అవలంభించిన ప్రజావ్యతిరేక విధానాలపై అవగాహన కల్పిస్తామన్నారు. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ భవిష్యత్తు ప్రణాళికలు సైతం వివరించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికీ చేరుకోవడమే బీజేపీ లక్ష్యమన్నారు.
‘11,763 పోలింగ్ బూత్‌లెవల్ బృందాలకు ఇప్పటికే శిక్షణ ఇచ్చాం. ఒక్కో బృందంలో 32 మంది సభ్యులున్నారు. వీరిలో మహిళలు, యువత ఇలా అన్ని వర్గాల వారికి ప్రాధాన్యం ఇచ్చాం’అని గోయల్ పేర్కొన్నారు. ఈ బృందాలను పార్టీ సీనియర్ నాయకులు అనుసంధానిస్తుంటారని పేర్కొన్నారు. ప్రతి బృందంలోని 20 మంది సభ్యులు ఆ ప్రాంతంలోని ఇంటింటికి వెళ్లి పార్టీ విధానాలు వివరించడంతోపాటు, వారి సమస్యలు తదితర అంశాలపై ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారన్నారు. ఇలా 70 నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రతిపాదనల్లోని ప్రధాన అంశాలను పార్టీ మేనిఫెస్టోలో పెట్టేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఇలా చేస్తే ప్రతి కుటుంబానికి సంబంధించిన అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్టువుతుందన్న అభిప్రాయాన్ని గోయల్ వెల్లడించారు.
ప్రచార బృందాలకు ప్రత్యేక కిట్
ప్రచార కార్యక్రమంలోనూ బీజేపీ నాయకులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రచారానికి వెళ్లే బృందాల కోసం ప్రత్యేకంగా కిట్లు తయారు చేశారు. దీనిలో బుక్‌లెట్, పార్టీ విధానాలను తెలియజేసే పత్రాలు, కాంగ్రెస్ పాలనలోని లోపాలపై అవగాహన కల్పించే అంశాలతో కూడిన పుస్తకాలు ఉంటాయి.
Advertisement