బావిలో శవమై తేలిన బాలుడు
Published Wed, Oct 2 2013 12:11 AM | Last Updated on Fri, Sep 1 2017 11:14 PM
సేలం, న్యూస్‌లైన్ : సేలంలో సోమవారం కిడ్నాప్‌కు గురైన బాలుడు మంగళవారం బావిలో శవంగా తేలాడు. సేలం పల్లపట్టి మారియమ్మన్ కోయిల్ వీధిలో నివాసముంటున్న లారీ మెకానిక్ తంగదురై (35). ఇతని భార్య తేన్‌మొళి. వీరి కుమారుడు బాలాజీ (10) ప్రైవేటు పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. సోమవారం మధ్యాహ్నం ఇంటి బయట ఆడుకుంటున్న బాలాజీ అకస్మాత్తుగా కనిపించలేదు. కుమారుడి కోసం గాలిస్తుండగా తంగదురై వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి డబ్బులు ఖర్చు చేస్తే చిక్కుతాడని తెలిపాడు. దీంతో సందేహించిన తంగదురై ఆయన బంధువులు ఆ వ్యక్తి ని సూరమంగళం పోలీసు స్టేషన్‌లో అప్పగించారు.
విచారణ జరిపిన పోలీసులు గోపిచెట్టిపాళయంకు చెందిన దామోదరన్ (27), సూరమంగళంకు చెందిన ప్రభు (18), శివదాపురానికి చెందిన సంతోష్ (30), మనకోట్టైకు చెందిన కార్తీ (26), ధర్మన్ నగర్‌కు చెందిన కలైవాణి (34)లను అదుపులోకి తీసుకుని విచారించారు. బాలాజీ కిడ్నాప్‌కు వారికి సంబంధం లేదని విచారణలో తేలింది. ఈ స్థితిలో మంగళవారం వేకువజామున పల్లపట్టి మారియమ్మన్ ఆలయం సమీపంలో ఉన్న దిగుడు బావిలో అగ్నిమాపక సిబ్బంది గాలిస్తుండగా బాలాజీ మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాలాజీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సేలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా తొలుత పోలీసులు పిట్టగోడ లేని ఆ బావి వద్ద ఆడుకుంటున్న బాలాజీ అందులో పడి మృతి చెంది ఉండవచ్చని భావించారు. అయితే సోమవారం మధ్యాహ్నం బావిలో పడ్డ బాలాజీ మంగళవారం ఉదయం శవంగా తేలడంపై పలు అనుమానాలకు తావిస్తోందని పోలీసులు అంటున్నారు.
అంతేకాకుండా బాలాజీ శవం ఉబ్బకుండా, సాధారణ స్థితిలోనే ఉంది. దీంతో బాలాజీని నీటిలో తోసి హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా సోమవారం మధ్యాహ్నం నుంచీ ఆ ప్రాంత యువకులు బాలాజీ కోసం ఆ బావిలో మంగళవారం వేకువ జాము 1.30 గంట వరకూ గాలించారు. అయినా బాలుడి జాడ తెలియరాలేదు. రెండు గంటల తర్వాత అంటే మంగళవారం వేకువజామున 3 గంటలకు అగ్నిమాపక సిబ్బందికి బాలాజీ మృతదేహం లభ్యమైంది.
మంగళవారం వేకువజామున 1.30-3 గంటల మధ్య సమయంలో బాలాజీని ఎవరైనా నీటిలో పడవేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి బాలాజీ శవంగా తేలడంతో తీవ్ర దిగ్భ్రాంతి చెందిన తల్లిదండ్రులు, బంధువులు ఆవేశంతో ఆందోళన చేపట్టారు. ఆ ప్రాంతంలో ఉన్న దిగుడు బావి శిథిలావస్థకు చేరుకుని ఉంది. బావిని శుభ్రం చేయాలని పలుమార్లు కోరినా అధికారులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే దానినిపూడ్చివేయాలని డిమాండ్ చేశారు. దీంతో మూడు రోడ్ల ప్రాంతంలో గంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుడు బావిలో శవమై తేలడంతో సేలంలో విషాదచాయలు అలుముకున్నాయి.
Advertisement
Advertisement