సాక్షి, ముంబై: ఠాణే సమీపంలోని కల్వా ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున భవనం కూలిపోయింది. అయితే పెళ్లి కారణంగా కొంతమంది మేలుకుని ఉండడంతో అందులో నివసిస్తున్న వారందరికీ పెనుగండం తప్పింది. స్థానికులు, పోలీసులు అందించిన వివరాల ప్రకారం భుసార్‌అలీ ప్రాంతంలో అన్నపూర్ణ అనే నాలుగు అంతస్తుల భవనం ఉంది. అందులో నివసిస్తున్న తెలంగే అనే వ్యక్తి ఇంట్లో సోమవారం ఉదయం పెళ్లి కార్యక్రమం ఉంది. దీంతో కుటుంబ సభ్యులందరూ మెలకువగా ఉన్నారు.
ఇంతలో వారందరికీ ఏదో అలికిడి వినిపించింది. దీంతో కీడు శంకించిన వీరంతా ఆ భవనంలో అప్పటికి నిద్రావస్థలో ఉన్నవారిని మేలుకొలిపి నిద్రలేపి బయటకు వెళ్లాలంటూ బిగ్గరగా కేకలేశారు. దీంతో వారంతా భవనం నుంచి బయటికి వచ్చి కొద్దిదూరంలో నిలబడ్డారు. దీంతో సురక్షితంగా బయటపడ్డారు. అయితే భవనం కూలిపోవడంతో అంతా కన్నీరుమున్నీరయ్యారు.