
మేఘ మథనం
► టెండర్లు పిలిచాం
► సీఎం సిద్ధరామయ్య
మైసూరు: త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. ఆయన శనివారం మైసూరు నగరంలోని రామకృష్ణనగర్‌లో తమ నివాసంలో మీడియాతో మాట్లాడారు. హోంమంత్రి పదవికి రాజీనామా చేస్తూ కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ అందించిన రాజీనామా పత్రాన్ని గవర్నర్ వజూభాయ్‌వాలాకు పంపించామని చెప్పారు. రాష్ట్రంలో ముంగారు వర్షాలు ఆశించినస్థాయిలో కురవడం లేదని, జూన్ నెలాఖరులోనైనా మంచి వానలు వస్తాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోతుండడంతో ప్రత్యామ్నాయంగా మేఘమథనానికి టెండర్లను ఆహ్వానించామని తెలిపారు.
తమ కుమారుడిని రాజకీయాల్లోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారంటూ జేడీఎస్ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామి చేసిన విమర్శలపై సిద్ధు స్పందించారు. తాము గత 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటున్నామని ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో తమ కుటుంబం నుంచి ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయలేదన్నారు. తమపై విమర్శలు చేసే కుమారస్వామి జేడీఎస్ పార్టీలో తమ కుటుంబ సభ్యులు ఎంతమంది రాజకీయాల్లో ఉన్నారో ప్రజలందరికీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
మైసూరు నగరంలో ప్రబలుతున్న డెంగ్యూ తదితర విషజ్వరాలను అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమావేశమై సూచనలు జారీ చేశామన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన జనతాదర్శన్ కార్యక్రమంలో మైసూరుతో పాటు మండ్య, చామరాజనగర జిల్లాల ప్రజలు పెద్దసంఖ్యలో వినతిపత్రాలను అందజేశారు. సహకార బ్యాంకుల్లో రూ.50వేల వరకు రుణమాఫీ చేసినందుకుగానూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులకు సీఎం సిద్ధరామయ్యకు స్వీట్లు, పుష్పగుచ్చాలతో అభినందనలు తెలిపారు.
హోంమంత్రి పరమేశ్వర్ రాజీనామా ఆమోదం!
పీసీసీ అధ్యక్షపదవిలో కొనసాగేలా కాంగ్రెస్ అధిష్టానం మేరకు హోంమంత్రి పదవికి పరమేశ్వర్ చేసిన రాజీనామాను గవర్నర్ వజూభాల్ వాలా ఆమోదించినట్లు తెలిసింది. పీసీసీ పదవిలో కొనసాగేందుకు ఆయన మంత్రి పదవికి నెల కిందట కిందట రాజీనామా చేయడం తెలిసిందే.