సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ఎన్నికల్లో ఓటు వేయడానికి ముందు ఓటర్ల ఎడమ చేయి చూపుడు వేలుకు సిరా గుర్తు పెట్టడం ఆనవాయితీ. దొంగ ఓట్లను నివారించడానికి ఇదో ప్రయత్నం. అలాంటి ఈ సిరాకు గొప్ప చరిత్రే ఉంది. ఒకసారి ఈ సిరా గుర్తు పెడితే కనీసం 30 రోజులైనా దాని ఆనవాళ్లు చెక్కు చెదరకుండా ఉంటాయి.
ఈ విశిష్టమైన సిరాను మైసూరులో తయారు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ మైసూరు పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ (ఎంపీవీఎల్)కు ఈ అరుదైన ఘనత దక్కుతోంది. విదేశాలకు కూడా ఈ సిరా సరఫరా అవుతుంది. మన దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడం ప్రభుత్వానికే కాకుండా కమిషన్‌కు పెద్ద సవాలు. దీనిని విజయవంతంగా పూర్తి చేయడంలో భాగంగా బోగస్ ఓటింగ్‌ను నివారించడానికి ఈ సిరా వినియోగాన్ని చేపట్టారు.
రసాయనాలు లేదా సబ్బులు, నూనెలతో ఈ గుర్తును చెరిపి వేయడం ఏ మాత్రం సాధ్యం కాదు. భారత ఎన్నికల సంఘం, నేషనల్ ఫిజికల్ లేబొరేటరీ, నేషనల్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ల సహకారంతో ఈ సిరా ఉత్పత్తి, సరఫరాలో ఎంపీవీఎల్ ప్రత్యేకతను సాధించింది. ఇలాంటి సిరా తయారీకి ప్రత్యేక లెసైన్స్‌ను కేవలం ఎంపీవీఎల్ 1962లో పొందింది.
మైసూరు రాజుల కాలంలో...
మైసూరు మహారాజు దివంగత నాల్వడి కృష్ణరాజ ఒడయార్ హయాంలో 1937లో మైసూరు లాక్ అండ్ పెయింట్ వర్క్స్ పేరిట ఈ కంపెనీ ఏర్పాటైంది. 1989లో ఎంపీవీఎల్‌గా పేరు మారింది. 1962లో ఎన్నికల కమిషన్ సిరా సరఫరా కోసం ఈ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. 1976 నుంచి మరో 28 దేశాలకు కూడా ఇక్కడి నుంచి సిరా సరఫరా అవుతోంది.
విశేషాలు
2009 సార్వత్రిక ఎన్నికలకు పది మి.లీ. పరిమాణం కలిగిన సుమారు 20 లక్షల సీసాలను ఎంపీవీఎల్ సరఫరా చేసింది. ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే 2.88 లక్షల సీసాలు ఖర్చయ్యాయి.
2006 ఫిబ్రవరి ఒకటో తేది నుంచి ఓటరుకు ఎడమ చేతి చూపుడు వేలుపై గోరు పైభాగం నుంచి కింది వరకు గీత గీసే వారు. అంతకు ముందు గోరుపైన ఉండే చర్మం పై గుర్తు పెట్టే వారు.
వేలిపై పెట్టే సిరాలో సిల్వర్ నైట్రేట్ ఉంటుంది. తద్వారా సూర్య కిరణాలు తగలగానే చర్మంపై స్పష్టమైన గుర్తు ఏర్పడుతుంది. దరిమిలా దీనిని చెరిపి వేయడం సాధ్యం కాదు. బయట చర్మం కణాలను మార్పు చేస్తే తప్ప దీనిని చెరిపి వేయలేం.
సాధారణంగా ఈ సిరా ఊదా రంగులో ఉంటుంది. సురినాం దేశంలో 2005లో జరిగిన ఎన్నికల్లో నారింజ రంగులో వాడారు.
దేశ ఎన్నికలపై మైసూరు సిరా
Published Tue, Mar 18 2014 2:24 AM | Last Updated on Sat, Sep 2 2017 4:49 AM
Advertisement
Advertisement