= వడ్డీలు చెల్లించలేని దుస్థితిలో బీబీఎంపీ..
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : సమాజంలో దివాళా తీసిన వాడిని గురించి ‘వడ్డీకి వడ్డీ కట్టి మునిగిపోయాడు’ అని చెప్పడం సహజం. ఘనత వహించిన బృహత్ బెంగళూరు మహా నగర పాలికె (బీబీఎంపీ)ను ఇప్పుడు ఆ విధంగానే పిలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పులు, వడ్డీలు చెల్లించలేక ఏకంగా నగరంలోని ప్రతిష్టాత్మక టౌన్ హాలును తాకట్టు పెట్టడానికి బీబీఎంపీ సిద్ధమైంది. ఆర్థిక పరంగా ఇప్పటికే పీకల లోతు కష్టాల్లో మునిగిపోయిన బీబీఎంపీ, ప్రస్తుతం టౌన్ హాలును తాకట్టు పెట్టాలని నిర్ణయించడంపై సర్వత్రా విమర్శల పాలవుతోంది.
కెనరా బ్యాంకు నుంచి 2010లో తీసుకున్న రుణాన్ని చెల్లించలేక, టౌన్ బ్యాంకును అదే బ్యాంకుకు తాకట్టు పెట్టడం ద్వారా రుణ విముక్తం కావాలని బీబీఎంపీ నిర్ణయించింది. సోమవారం జరిగిన బీబీఎంపీ సర్వ సభ్య సమావేశంలో ఈ మేరకు సర్క్యులర్‌ను కూడా ప్రవేశపెట్టింది. నగరంలో ప్రాథమిక సదుపాయాల కల్పన కోసం చెల్లింపు హుండీల ద్వారా బీబీఎంపీ కెనరా బ్యాంకు నుంచి ఓవర్‌డ్రాఫ్ట్ రూపంలో రూ.155 కోట్లు తీసుకుంది.
దీనికి 14 శాతం వడ్డీని కలుపుకొంటే ప్రస్తుతం ఆ మొత్తం రూ.200 కోట్లకు చేరుకుంది. ఎంతకూ ఈ మొత్తాన్ని చెల్లించక పోవడంతో కెనరా బ్యాంకు ఈ లావాదేవీని ఎన్‌పీఏ (నిరర్థక ఆస్తి)గా పరిగణించింది. పరువు పోతుందని గ్రహించిన బీబీఎంపీ ఈ గండం నుంచి బయటపడే మార్గం చెప్పాల్సిందిగా బ్యాంకును కోరింది. కెనరా బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న టౌన్ హాలుతో పాటు దాని పక్కనున్న పార్కింగ్ ప్రదేశాన్ని తాకట్టుగా పెడితే ఎన్‌పీఏ ముద్ర పడకుండా చూస్తామని బ్యాంకు సూచించింది. పైగా రుణ మొత్తంలో రూ.45 లక్షల రాయితీ కూడా ఇస్తామని హామీ ఇచ్చింది.
ఇదేదో చక్కని ఐడియా అని భావించిన బీబీఎంపీ, తాకట్టుకు సిద్ధమైంది. దీనిపై బీబీఎంపీ కమిషనర్ లక్ష్మీ నారాయణ సీఎం క్యాంప్ కార్యాయం కృష్ణాలో సిద్ధరామయ్యతో గురువారం చర్చించారు. అయితే టౌన్ హాలు కాకుండా వేరే ఏదైనా భవనాన్ని తాకట్టు పెట్టాలని సీఎం సూచించినట్లు సమాచారం. దీంతో బీబీఎంపీ సందిగ్ధంలో పడింది.
ఘన చరిక్రత
టౌన్ హాలుకు ఘన చరిత్ర ఉంది. 1933లో అప్పటి మైసూరు మహారాజు క ృష్ణరాజ ఒడయార్ ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 1935 సెప్టెంబరు 11న నిర్మాణం పూర్తయింది. అప్పటి మహారాజు కంఠీరవ నరసింహ రాజ ఒడయార్ దీనిని ప్రారంభించారు. ఇందులో కార్యక్రమాలను 1,038 మంది కూర్చుని తిలకించే అవకాశం ఉంది.
తాకట్టుకు టౌన్‌హాల్
Published Fri, Jan 3 2014 2:50 AM | Last Updated on Sat, Sep 2 2017 2:13 AM
Advertisement