‘బ్రదర్‌ ఇదంతా రాజకీయ కక్ష.. నాకేం తెలియదు' | Shanmugam Who Was Involved In Irregularities Chittoor Town Bank | Sakshi
Sakshi News home page

‘బ్రదర్‌ ఇదంతా రాజకీయ కక్ష.. నాకేం తెలియదు'

Feb 19 2020 8:00 AM | Updated on Feb 19 2020 8:38 AM

Shanmugam Who Was Involved In Irregularities Chittoor Town Bank - Sakshi

షణ్ముగం (ఫైల్‌)

2005లో ప్రభుత్వ ఆస్తుల ధ్వంసంతో మొదలైన షణ్ముగం నేరచరిత్ర ఇప్పటి వరకు 14 కేసులకు చేరుకుంది. తనకు వ్యతిరేకంగా వార్తలు ప్రచురించిన పాత్రికేయుడిని బెదిరించడం నుంచి విధినిర్వహణలో ఉన్న పోలీసును కొట్టడం, మోసాలు, బెదిరింపులు, దౌర్జన్యాలు, ఆక్రమణలు, చెక్‌బౌన్స్‌ కేసులు ఇలా జిల్లాలోని తిరుపతి, చిత్తూరు, బంగారుపాళ్యం తదితర ఏడు స్టేషన్లలో ఇతనిపై కేసులు నమోదయ్యాయి. పలు కేసుల్లో అరెస్టుకాకుండా టీడీపీ నేతల పేర్లుచెప్పి ఇన్నాళ్లు తప్పించుకుని తిరుగుతున్నాడు. చిత్తూరు టౌన్‌ బ్యాంకును బురిడీ కొట్టించిన కేసులో ఎట్టకేలకు అరెస్టయ్యాడు. 

సాక్షి, చిత్తూరు అర్బన్‌:  షణ్ముగం.. చిత్తూరులో పరిచయం అవసరం లేని పేరు. ఎంతటివారైనా ఇతని వాగ్ధాటి ముందు చిన్నబోవాల్సింది. వేటగాడి ఉచ్చునుంచి చిరుతపులైనా తప్పించుకోవచ్చుగానీ.. ఇతని మాటల ఉచ్చు నుంచి తప్పించుకోవడం అసాధ్యం. అలాంటి వ్యక్తికి నాటి టీడీపీ పాలకులు వేలాదిమంది ఖాతాదారులు కష్టాన్ని దాచుకున్న టౌన్‌బ్యాంకు పాలకవర్గం పగ్గాలు అప్పగించారు. దొంగ చేతికి తాళం అందినట్టుగా చైర్మన్‌ హోదాలో బ్యాంకుకే శఠగోపం పెట్టాడు. 5.16 కిలోల నకిలీ బంగారు ఆభరణాలతో తప్పుడు ఖాతాలతో చిత్తూరు సహకార టౌన్‌బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్న ఈ మోసగాడి దెబ్బకు బకాయిలు రూ.1.20 కోట్లకు చేరుకున్నాయి. అతన్ని మంగళవారం అరెస్టుచేసిన పోలీసులు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. చిత్తూరు నగర డీఎస్పీ కవలకుంట్ల ఈశ్వర్‌రెడ్డి, వన్‌టౌన్‌ సీఐ ఎన్‌.భాస్కర్‌రెడ్డిలు విలేకరులకు షణ్ముగం నేరాలచిట్టాను వివరించారు.   చదవండి: అమరావతిలో పరిటాల బంధువుల పాగా 

షణ్ముగంను కోర్టుకు తరలిస్తున్న పోలీసులు 
♦టౌన్‌బ్యాంకు చైర్మన్‌గా ఉన్నప్పుడే షణ్ముగం ఉద్దేశపూర్వకంగా బ్యాంకును బురిడీకొట్టించాలని పథకం పన్ని ఖాతాదారుల డిపాజిట్ల నుంచి నకిలీ బంగారు ఆభరణాలపై రుణాలు తీసుకున్నాడు. వచ్చిన డబ్బులతో తన ఇద్దరు భార్యలకు రెండు కార్లు, మొదటి భార్య కుమార్తెకు నాగాలమ్మ గుడి వద్ద ఓ ఇల్లు, రెండో భార్య పేరిట టెలిఫోన్‌ కాలనీలో మరో ఇల్లు కొన్నాడు. దాదాపు రూ.కోటి విలువచేసే ఆస్తు లు, వాహనాలను పోలీసులు సీజ్‌ చేశారు. 
♦టీడీపీ ప్రభుత్వ హయాంలో ఓ మంత్రి వద్ద తన కుమారుడు పేషీగా పనిచేస్తున్నట్లు చూపించి టీటీడీకి వందలాది సిఫారసు లేఖలు ఇచ్చి దర్శనాలు, గదులు, ప్రసాదాలు పొందినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై దర్యాప్తు చేయాలని టీటీడీ విజిలెన్స్‌కు లేఖ రాస్తున్నట్లు డీఎస్పీ వెల్లడించారు.  
♦ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు గుంజేసినట్లు ఫోన్‌లో ఫిర్యా దులు వచ్చాయని.. దీనిపై బాధితులు ధైర్యంగా ముందుకువచ్చి జిల్లాలోని ఏ పోలీస్‌ స్టేషన్‌లో అయినా కేసు పెట్టొచ్చని డీఎస్పీ పేర్కొన్నారు.  
♦ తిరుపతిలో ఇనామ్‌ భూములు పేరుమార్చి ఇస్తానని చెప్పి రూ.17.60 లక్షలు మోసం చేసి తప్పించుకుని తిరుగుతున్న పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వెంకటగిరికి చెందిన కృష్ణారెడ్డి డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆభరణాలు తాకట్టుపెడతానని చెప్పి తనపేరిట ఖాతా తెరచి తీరా నకిలీ బంగారు ఆభరణాలు పెట్టి రూ.6.55 లక్షలు అప్పుచేశాడని మరో బాధితుడు చిరంజీవి తెలిపాడు. ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురిని మోసం చేసినట్లు తాజాగా చిత్తూరు ఎస్పీ సెంథిల్‌కుమార్‌కు మరో ఫిర్యాదు అందగా.. దీనిపై విచారణ చేస్తున్నారు. 

ఇంత జరిగిన తరువాత ఎలాంటి వ్యక్తిలో అయినా పశ్చాత్తాపం ఉంటుంది. కానీ షణ్ముగం మాత్రం ‘‘బ్రదర్‌.. ఇది పూర్తిగా అన్యాయం. నాపై రాజకీయకక్షతో కేసులు పెట్టించారు. నాకేమీ తెలియదు..’’ అంటూ కేకలు వేయడం అతనికే చెల్లుతుందని అందరూ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ఇంతటి నేరచరిత్ర ఉన్న వ్యక్తికి టౌన్‌బ్యాంకు చైర్మన్‌ పదవిలో ఎలా కూర్చోబెట్టారని పోలీసులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. షణ్ముగంపై రౌడీషీట్‌ తెరవడానికి ఎస్పీకి ప్రతిపాదనలు పంపుతున్నట్లు తెలిపారు.

 
తమ పేరిట నకిలీ బంగారు పెట్టాడని చెబుతున్న బాధితుడు చిరంజీవి  

టీడీపీ నేత షణ్ముగంకు 14 రోజుల రిమాండ్‌ 
చిత్తూరు సహకార టౌన్‌బ్యాంకును మోసం చేసి నకిలీ ఆభరణాలతో రూ.1.20 కోట్లు బకాయిపడ్డ టీడీపీ నేత షణ్ముగంకు 14 రోజుల రిమాండ్‌ విధిస్తూ న్యాయమూర్తి నిరుపమాబాంజ్‌దేవ్‌ ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం షణ్ముగంను అరెస్టు చేసిన పోలీసులు చిత్తూరులోని 4వ అదనపు మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌ న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. షణ్ముగంను మార్చి 3వ తేదీ వరకు న్యాయమూర్తి రిమాండుకు ఆదేశించడంతో చిత్తూరులోని జిల్లా జైలుకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement