= మగ సంతానం లేదని ఆత్మహత్య
= పెళ్లి రోజు వేడుకలో విషాదం
= తల్లి ప్రేమకు దూరమైన ముగ్గురు చిన్నారులు
= శోకసంద్రమైన గార్లదిన్నె
ప్యాపిలి(కర్నూలు), న్యూస్‌లైన్: ఆడపిల్ల. ఇప్పటికీ ఆడ..పిల్లగానే మిగిలిపోతోంది. యుగాలు మారినా.. మానవ మేధస్సు దినదినాభివృద్ధి చెందినా.. ఆ ఒక్క విషయంలో వీరి దృక్పథం మారకపోవడం ఆడపిల్ల భవిష్యత్తుపై పెను ప్రభావం చూపుతోంది. అసలు పిల్లలే కలగలేదని ఎంతో మంది కనిపించని దేవుళ్లకు మొక్కుతూ.. హస్తవాసి కలిగిన వైద్యులంటూ వారి ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
ఇదే సమయంలో కలిగినది ఆడపిల్ల అయితే మరో సమస్య. అత్తమామల ఎత్తిపొడుపులు.. తప్పు చేసిన దానిలా చూసే భర్తతో వేగలేక అదే ఆడపిల్ల నిత్యనరకం అనుభవిస్తోంది. ఈ కోవలో భర్త, అత్తమామల నుంచి ఎలాంటి వేధింపులు లేకపోయినా.. మగ సంతానం లేదనే బెంగతో ఓ మహిళ అర్ధాంతరంగా తనువు చాలించింది. అదీ పెళ్లి రోజునే ఆమె తీసుకున్న ఈ నిర్ణయం కుటుంబ సభ్యులతో పాటు గ్రామంలో విషాదం నింపింది.
ఆళ్లగడ్డ మండలం బాచ్చాపురం గ్రామానికి చెందిన వెంకటసుబ్బయ్య, సుభద్రమ్మ దంపతుల పెద్ద కుమార్తె సురేఖ(22)కు ప్యాపిలి మండలం గార్లదిన్నె గ్రామానికి చెందిన మద్దిలేటిస్వామితో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. గోబి బండి నిర్వహణతో వీరి సంసారం సాఫీగా సాగిపోతోంది. పెళ్లయిన ఏడాదికే ఆడపిల్ల జన్మించడంతో మహాలక్ష్మి కలిగిందని సంతోషపడ్డారు. మొదటి కాన్పులో ఎవరు పుట్టినా.. ఆ తర్వాత మగ సంతానం కలుతుందిలే అనే బంధువుల మాటలు సురేఖ మనసులో బలంగా నాటుకుపోయాయి.
మలి విడత గర్భం దాల్చగా.. ఆరు నెలల క్రితం కవలలు జన్మించారు. ఆమె ఆశలను తలకిందులు చేస్తూ రెండో విడతలోనూ ఇరువురూ ఆడపిల్లలే కలగడం తట్టుకోలేకపోయింది. భర్త తరపు నుంచి ఎలాంటి వేధింపులు లేకపోయినా.. ఇదేదో తప్పుగా భావించి ఆమె తనలో తనే కుమిలిపోసాగింది. తల్లికి కూడా ఇద్దరూ ఆడపిల్లలే కావడంతో.. తనకూ ఇకపై మగ పిల్లలు పుట్టరనే బెంగ పెట్టుకుంది. మంగళవారం పెళ్లి రోజు కావడంతో ఉదయం నుంచి ఆ ఇంట్లో హడావుడి నెలకొంది. సాయంత్రం వేళ పిల్లలతో కలసి వేడుక చేసుకునేందుకు భర్త మద్దిలేటి కేక్ తీసుకొస్తానంటూ డోన్‌కు బయలుదేరాడు.
ఈ సమయంలోనే ఆమె మనసును ‘మగ’పురుగు తొలచింది. మగపిల్లలు కలగలేదనే దిగులుతో ఉరేసుకొని తనువు చాలించింది. రాత్రికి ఇంటికి చేరుకున్న భర్త జరిగిన ఘోరాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యాడు. ఈమె తీసుకున్న అనాలోచిత నిర్ణయానికి ముగ్గురు పిల్లలు తల్లి ప్రేమకు దూరమయ్యారు. ఒక పాపకు మూడేళ్లు.. మరో ఇద్దరు కవలలకు ఆరు నెలలు కావడంతో విగతజీవురాలైన తల్లిని బంధువులు వారికి చూపలేకపోయారు. పిల్లలను బంధువుల ఇంట్లో వదిలి మృతదేహానికి అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. మృతురాలి తల్లి సుభద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జలదుర్గం ఎస్సై జయన్న తెలిపారు.