న్యూస్‌లైన్, మంత్రాలయం (కర్నూలు): జగద్గురుని మహా రథయాత్ర అత్యంత వైభవంగా సాగింది. భక్తజనుల శ్రీగురుని నామజపం.. వేదపండితులు వేదపఠనం.. మంగళవాయిద్యాల సుస్వరాగం.. కళాకారుల కోలాహలం మధ్య లోకగురువు మహారథంపై ఊరేగారు. రాఘవుని రథయాత్రతో వేదభూమి వైభవం చాటగా తుంగభద్రమ్మ పరవశించింది. రాఘవరాయుడి కీర్తిని భక్తజనం పొగడగా..కళాకారుని అందె చిందేసింది.
రాఘవేంద్రుడి 342వ ఆరాధన సప్త రాత్రోత్సవాల్లో భాగంగా ఉత్తరాధన సందర్భంగా మహారథయాత్ర నిర్వహించారు. మఠం పీఠాధిపతి సుయతీంధ్రతీర్థులు, ఉత్తరాధికారి సుభుదేంద్రతీర్థులు ఉత్సవమూర్తి ప్రహ్లదరాయులను మహారథంపై ఉంచి పూజలు, మహా మంగళాహారథులు ఇచ్చారు. భక్తులకు రాఘవేంద్రుడి మహిమలతో కూడిన చరితను వినిపించి మహారథయాత్రకు అంకురార్పన చేశారు. శ్రీమఠం ప్రాంగణం నుంచి ప్రధాన ముఖద్వారం మీదుగా రాఘవేంద్రుల సర్కిల్ వరకు అంగరంగా వైభవంగా రథయాత్ర సాగింది. సర్కిల్ మీదుగా మఠం ప్రాంగణం వరకు లాగి యాత్రకు ముగింపు పలికారు.
నేడు సుజ్ఞానేంద్రతీర్థుల ఆరాధన
రాఘవేంద్రుల ఆరాధన సప్త రాత్సోవాల్లో సందర్భంగా శనివారం పూర్వపు పీఠాధిపతులు సుజ్ఞానేంద్రతీర్థుల ఆరాధన నిర్వహిస్తారు. ఉభయపీఠాధిపతులు సుయతీంద్రతీర్థులు, సుభుదేంద్రతీర్థులు వారి పటాలకు విశిష్టపూజలు నిర్వహిస్తారు. యోగీంద్ర సభా ప్రాంగణంలో బెంగుళూరుకు చెందిన మదుసూధన్ నందగిరిచే దాసవాణి ఉంటుంది. బళ్లారికి చెందిన కళాక్షితి డ్యాన్స్ స్కూల్ బందంచే భరతనాట్య ప్రదర్శన నిర్వహిస్తారు.
పాహిమాం.. రాఘవేంద్ర
Published Sat, Aug 24 2013 2:26 AM | Last Updated on Fri, Sep 1 2017 10:03 PM
Advertisement
Advertisement