ఆమె తన జోలికి వస్తారనుకోలేదు... | The Right to Dissent Being Threatened, Says Gauri Lankesh Last Inverview | Sakshi
Sakshi News home page

ఆమె తన జోలికి వస్తారనుకోలేదు...

Published Wed, Sep 6 2017 8:21 PM | Last Updated on Sun, Sep 17 2017 6:29 PM

ఆమె తన జోలికి వస్తారనుకోలేదు...

ఆమె తన జోలికి వస్తారనుకోలేదు...

తాను మహిళ కావడమే తనకు భద్రతనీ, తండ్రి ఎదుర్కొన్న ప్రమాదాలు, అవరోధాలు తనకు ఉండవనే ధీమాను ప్రముఖ జర్నలిస్ట్, మతసామరస్య వేదిక నాయకురాలు గౌరీ లంకేశ్‌ ధీమా.

మహిళ కావడమే భద్రతని నమ్మిన గౌరీ లంకేష్‌!
తాను మహిళ కావడమే తనకు భద్రతనీ, తండ్రి ఎదుర్కొన్న ప్రమాదాలు, అవరోధాలు తనకు ఉండవనదే ప్రముఖ జర్నలిస్ట్, మతసామరస్య వేదిక నాయకురాలు గౌరీ లంకేశ్‌ ధీమా. కాని, ఆమెకున్న నమ్మకం తప్పని బెంగళూరులో మంగళవారం రాత్రి హంతకుల తూటాలు నిరూపించాయి. 2000 సంవత్సరంలో తండ్రి, ప్రఖ్యాత రచయిత, పాత్రికేయుడు పి.లంకేష్‌ మరణానంతరం మూసేయాలనుకున్న లంకేష్‌ పత్రిక సంపాదకత్వం చేపట్టాక గౌరీ ఇంగ్లిష్‌ న్యూస్‌ వెబ్‌సైట్‌ రీడిఫ్‌ ప్రతినిధి ఎండీ రీతీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భద్రతపై చాలా ధీమాగా మాట్లాడారు.

అయితే, ఎలాంటి రిస్క్‌ తీసుకోకుండా జాగ్రత్తపడుతున్నట్టు కూడా ఆమె వెల్లడించారు. తండ్రి మరణించిన రెండు రోజులకు ప్రధాన స్రవంతి మీడియాలో పదహారేళ్ల అనుభవమున్న 38 సంవత్సరాల గౌరి లంకేశ్‌ పత్రిక ఎడిటర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆమె సంపాదకత్వంలో రెండు నెలలు గడిచాయి. ఈ రాజకీయ వారపత్రిక సర్క్యులేషన్‌ గతంలో మాదిరిగానే 70 వేల కాపీల దగ్గర నిలబడి నిలదొక్కుకుంది. అప్పటికి పత్రిక నిర్వహణ, విధానాలపై తమ్ముడు ఇంద్రజీత్‌తో గొడవలు కూడా మొదలు కాలేదు. కొన్నేళ్ల క్రితమే భర్త, ప్రఖ్యాత ఆంగ్ల జర్నలిస్ట్‌ చిదానంద రాజ్‌ఘట్టా నుంచి గౌరి విడాకులు తీసుకుని, సొంతూరు(బెంగళూరు) వచ్చి ఒంటరిగానే జీవిస్తున్నారు.

ఈ సందర్భంగా  అదే ఏడాది మార్చి 15న రీడిఫ్‌ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యక్తిగత భద్రత గురించి రీతీ ప్రశ్నించారు. ‘‘ మీ తండ్రి తరచు కోర్టు కేసులతోపాటు  ప్రాణానికి ముప్పు ఎదుర్కున్నారు. చంపుతామనే హెచ్చరికలు లంకేశ్‌కు రావడం అలవాటే. అయినా, ఆయన ఇవేమీ పట్టించుకోలేదు. ధైర్యంగా ముందుకు సాగారు. ఇంకా యవ్వనంలోనే ఉన్న ఒంటరి మహిళగా మీరు అంత ఒత్తిడిని తట్టుకోగలరా?’’ అని ప్రశ్నించగా, ‘నా తండ్రిపై కొందరు కేసులు పెట్టిన విషయం నిజమేగాని ఆయన ప్రచురించిన విషయాలన్నీ కరక్టే కావడంతో అంతకు అనేక రెట్ల మంది ఆయనను కోర్టుకు లాగకుండా మిన్నకుండిపోయారు.

పత్రిక పదును తగ్గకుండా మరింత ప్రొఫెషనల్‌గా నడపడానికి ప్రయత్నిస్తున్నా. ఈ పరిస్థితుల్లో మహిళగా ఈ ఎడిటర్‌ విధులు నిర్వర్తించడం నాకెంతో అనుకూలాంశం. మా నాన్నంటే కోపమున్న రాజకీయ నాయకుడిని మా రిపోర్టరెవరైనా కలిస్తే నాన్నను ఆ నేత బండ బూతులు తిడతారు. అదే ఓ మహిళపై ఎవరైనా ఇలా నోరుపారేసుకుంటే సమాజంలో వారు పరువు మర్యాదలు కోల్పోతారు. కాబట్టి,  నేను మహిళను కావడమే ప్రస్తుతానికి నాకు భద్రత,’ అని గౌరి ఎంతో ఆత్మవిశ్వాసంతో జవాబిచ్చారు.

‘15 రోజుల నుంచి ఇంటికి చేరే వరకూ డ్రైవర్‌ నా వెంట ఉంటున్నాడు’
వెంటనే గౌరి భద్రతపై రీడిఫ్‌ రీతీ మరో ప్రశ్న అడిగారు. ‘ సరే, జనం మిమ్మల్ని అసభ్య పదాలతో దూషించకపోవచ్చుగాని, మీరు స్త్రీ కావడం వల్ల మీపై భౌతిక దాడులకు తెగబడే ప్రమాదం ఉంది. మీ తండ్రిపై అనేకసార్లు దాడులకు ప్రయత్నాలు జరిగాయి. మీరు భర్త తోడు లేకుండా నగరంలో ఒంటరిగా నివసిస్తున్న కారణంగా మీపై దాడి సులువని వారు భావిస్తారు కదా?’ అని ప్రశ్నించగా, ‘ భౌతిక దాడులంటే నేనేమాత్రం భయపడను. పదిహేను రోజుల క్రితం వరకూ నేను ఒంటరిగా తెల్లవారుజామున మూడు గంటలకు ఇంటికెళ్లడం నాకు అలవాటే.’

ఓసారి మా ఇంటి దగ్గరల్లో రోడ్డు మధ్యలో చీర చుట్టుకుని పడుకున్న ఓ మగాడిని చూశాక, అలా వేకువ జామున ఇల్లు చేరడానికి స్వస్తి పలికాను. తెలియని వ్యక్తుల నుంచి బ్లాంక్‌ కాల్స్‌ కూడా నాకు రావడం లేదు. తాలూకా స్థాయి బ్లాక్‌మెయిల్‌ పత్రికల్లో నా వ్యక్తిగత జీవితం గురించి రాస్తామంటూ ఒకరిద్దరు నన్ను బెదిరించి లొంగదీయడానికి ఫోన్‌ ద్వారా ప్రయత్నించారు.

‘నా గురించి ఏం రాస్తారో రాసుకోండి. నా భండారం బయట పెట్టడానికి నేనీమీ తప్పు చేయలేదు’ అని చెప్పడంతో అలాంటి ఫోన్‌కాల్స్‌ మళ్లీ నాకు రాలేదు,’’ అని గౌరీ 17 ఏళ్ల క్రితం పత్రిక ఎడిటర్‌ పదవి చేపట్టిన రెండు నెలలకు సామాజిక వ్యవస్థపై వ్యక్తం చేసిన నమ్మకం తప్పని మంగళవారం రుజువైంది. కిరాయి హంతకుల చేతుల్లో నమ్మిన సిద్ధాంతాలు, ఆచరణ కోసం ప్రాణాలు కోల్పోయిన తొలి మహిళా జర్నలిస్టుగా గౌరీ లంకేష్‌ చరిత్రకెక్కారు.

(సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement