= దళితులపై దాడులను నిరసిస్తూ డీఎస్‌ఎస్ ఆందోళన
= ఫ్రీడం పార్క్‌లో ధర్నా
= దాడులు అరికట్టడంలో ప్రభుత్వం విఫలం: మోహన్‌రాజు
బెంగళూరు, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో దళితులపై దాడులను కర్ణాటక దళిత సంఘర్షణ సమితి(డీఎస్‌ఎస్) శుక్రవారం చేపట్టిన సీఎం నివాసం ‘కృష్ణ’ ముట్టడిని పోలీసులు భగ్నం చేశారు. దీంతో ఆందోళనకారులు ఫ్రీడం పార్క్ చేరుకుని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా డీఎస్‌ఎస్ రాష్ట్ర కన్వీనర్ ఆర్.మోహన్‌రాజ్ ప్రసంగిస్తూ... రాష్ట్రంలో దళితుపై దాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఎస్‌సీ, ఎస్‌టీ ముసుగులో ఇతర కులస్తులు నకిలీ సర్టిఫికెట్లు పొంది అసలైన దళితులకు తీరని అన్యాయం చేస్తున్నారని తెలిపారు.
దొడ్డదారిన చాలా మంది రాజకీయంగా పదవులు పొందారని ఆరోపించారు. నకిలీ సర్టిఫికెట్లు పొందిన వారిపై, మంజూరు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ రంగాలలో ఎస్‌సీ, ఎస్‌టీలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తామంటూ అధికారంలోకి వచ్చిన యూపీ ఏ సర్కార్ నేడు దళితులను మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌సీ, ఎస్‌టీలకు లీజుకు ఇచ్చిన ప్రభుత్వ భూములపై వారికే హక్కు పత్రాలను అందజేయాలని కోరారు.
ఉత్తర కన్నడ జిల్లాలో దళితుల హత్యలు, అత్యాచారాలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని అన్నారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఆంజనేయ ఫ్రీడం పార్క్ చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. దళితులకు అన్ని విధాలుగా న్యాయం చేస్తామని హామీనివ్వడంతో ఆంందోళనను విరమించారు. కార్యక్రమానికి కర్ణాటక తెలుగు ప్రజా సమితి అధ్యక్షుడు బొందురామస్వామి, బాబు రాజేంద్ర ప్రసాద్ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్‌ఎస్ పదాధికారులు డి.సిద్దరాజు, చక్రభావి భైరప్ప, మునికృష్ణ, ఆడుగోడి నాగరాజ్ పాల్గొన్నారు.
సీఎం నివాసం ముట్టడి భగ్నం
Published Sat, Nov 23 2013 2:42 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM
Advertisement