ఎంపీ అశోక్‌కుమార్
హొసూరు : క్రిష్ణగిరి లోకసభ నియోజకవర్గం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి పథకాలను తీసుకొస్తానని ఎంపీ అశోక్‌కుమార్ తెలిపారు. ఉచిత మిక్సీ, గ్రైండర్, ఫ్యాన్‌లను హొసూరు మున్సిపాలిటీలో లబ్ధిదారులకు అందజేసిన కార్యక్రమం అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. క్రిష్ణగిరి మీదుగా జోలార్‌పేటకు హొసూరు నుంచి రైలు మార్గం ఏర్పాటు విషయంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జిల్లాలోని ఏడవ జాతీయ రహదారిపై వంతెనలు ఏర్పాటు విషయంపై అధికారులతో చర్చిస్తున్నామని, ఆరులైన్ల జాతీయ రహదారిపై గ్రామాల వద్దబస్సు షెల్టర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. హొసూరు రైల్వేస్టేషన్ అభివృద్ధికి నిధులు కేటాయింపజేశానని, హొసూరు-తళి రోడ్డులో రైల్వేక్రాసింగ్ వద్ద అండర్ పాస్ ఏర్పాటు విషయం పార్లమెంట్‌లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
జిల్లాలో హొసూరు, డెంకణీకోట, క్రిష్ణగిరి తాలూకాలలో ప్రజలకు ప్రభుత్వ పథకాలు చేరడంలేదని, ఈ ప్రాంతాలలో తెలుగు, కన్నడ భాషా ప్రజలకు తమిళంలో ప్రభుత్వ సమాచారం చేరవేయడంతో ప్రజలు లబ్దిపొందలేదని విలేకరులు సూచించగా ఈ విషయంపై జిల్లా కలెక్టర్ తో చర్చించి తెలుగు, కన్నడంలో వివరాలను తెలిపే విధంగా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు.బస్సులలో, కార్యాలయాలలో తెలుగు బోర్డులు ఏర్పాటు విషయం జిల్లా ఇన్‌చార్జ్ మంత్రితో చర్చించి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. చెరువులలో పూడిక తీసే విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక పథకాన్ని అమలు చేస్తున్నారని, ఆ పథకం అమలు జరుగుతుందని సూచించారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ బాలక్రిష్ణారెడ్డి, వైస్ చైర్మన్ రాము, యూనియన్ చైర్‌పర్సన్ పుష్పాసర్వేశ్, అన్నాడీఎంకే కార్యదర్శి నారాయణ, నాయకులు రామచంద్రప్ప తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర పథకాలు అమలు చేస్తా...
Published Sun, Jul 19 2015 2:15 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement