ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అక్రమాలు చోటుచేసుకున్నాయని దాఖలైన ప్రజాహిత వాజ్యంపై సుప్రీం కోర్టు స్పందిస్తూ భూయజమానులు వస్తే చూద్దామని వ్యాఖ్యానించింది. ఈ అంశంపై ప్రజాహిత వాజ్యాన్ని విచారణకు స్వీకరించలేమంటూ తోసిపుచ్చింది. ప్రముఖ సంపాదకులు ఎ.బి.కె.ప్రసాద్, జర్నలిస్టు వి.వి.రమణమూర్తి, న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్ ఈ పిటిషన్ దాఖలు చేయగా శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్.ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది.
పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది అరుణేశ్వర్ గుప్తా తొలుత వాదనలు ప్రారంభించగా ప్రధాన న్యాయమూర్తి కల్పించుకుని ‘మీరు రైతుల తరపున పిటిషన్ దాఖలు చేశారా..’ అని ప్రశ్నించారు. దీనికి న్యాయవాది స్పందిస్తూ ‘జర్నలిస్టుగా ప్రజాహిత వ్యాజ్యం దాఖలుచేశాం’ అని తెలపగా.. భూయజమానులు వస్తే చూద్దాం అంటూ ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. ప్రజాహిత వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించలేమని పేర్కొన్నారు.
ఈనేపథ్యంలో న్యాయవాది తిరిగి వాదనలు ప్రారంభిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా సింగపూర్ దేశంతో ఒప్పందాలు కుదుర్చుకుంటోందని, అక్కడి సంస్థలకు రాజధాని నిర్మాణాన్ని అప్పగిస్తోందని పేర్కొన్నారు. దీనికి ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ ‘వారు రాజధానిని నిర్మించాలనుకుంటున్నారు. మీరు ఆపాలని అనుకుంటున్నారా?’ అంటూ ప్రశ్నించారు. దీనికి న్యాయవాది స్పందిస్తూ ‘ఇందులో అనేక అంశాలు ఇమిడి ఉన్నాయి. సారవంతమైన భూములను రైతులకు ఇష్టం లేకున్నా బలవంతంగా సేకరించారు. నిపుణుల కమిటీ చేసిన సిఫారసులను పట్టించుకోకుండా సారవంతమైన భూముల్లో రాజధాని నిర్మిస్తున్నారు..’ అంటూ వివరించబోయారు. ఈ వాదనలను వినలేమంటూ ధర్మాసనం పిటిషన్‌ను తోసిపుచ్చింది.
భూయజమానులు వస్తే చూద్దాం: సుప్రీం
Published Fri, Aug 12 2016 6:37 PM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
Advertisement
Advertisement