Supreme Court Adjourns Hearing Amaravati Capital Petitions - Sakshi
Sakshi News home page

సుప్రీంలో అమరావతి రాజధాని కేసుల విచారణ డిసెంబర్‌కు వాయిదా!

Published Tue, Jul 11 2023 2:21 PM | Last Updated on Tue, Jul 11 2023 2:37 PM

Supreme Court adjourns hearing Amaravati capital petitions - Sakshi

ఢిల్లీ: అమరావతి రాజధాని కేసు  విచారణను దేశసర్వోన్నత న్యాయస్థానం డిసెంబర్‌కు వాయిదా వేసింది. రాజ్యాంగ ధర్మాసనం కేసులన్న నేపథ్యంలో.. ఈ కేసుకు త్వరగా సమయం కేటాయించలేమని పేర్కొంది. ఈలోపు ప్రతివాదులందరికీ నోటీసులు పంపే ప్రక్రియ పూర్తి చేయాలని మంగళవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన  ధర్మాసనం సూచించింది.  

ఆరు నెలల్లో అమరావతి నిర్మించాలన్న ఏపీ హైకోర్ట్ ఆదేశాలపై గత విచారణలో సుప్రీం కోర్టు  స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. కేంద్రం, ప్రతివాదులకూ నోటీసులు ఇచ్చిన సుప్రీం. ఇక గతంలో విచారణ చేసిన న్యాయమూర్తి జస్టిస్ కె ఎం జోసఫ్ రిటైర్ కావడంతో నూతన ధర్మసనానికి కేసు బదిలీ అయ్యింది. అయితే రాజ్యాంగ ధర్మాసనం పరిధిలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఇప్పడు ఈ కేసుల విచారణను డిసెంబర్‌కు వాయిదా వేస్తున్నట్లు ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది.

రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదన్న హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని పిటిషన్‌ ద్వారా అత్యున్నత న్యాయస్థానాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది. రద్దు చేసిన చట్టాలపై తీర్పు ఇవ్వడం సహేతుకం కాదని.. రాజ్యాంగం ప్రకారం మూడు వ్యవస్థలు తమ తమ అధికార పరిధుల్లో పని చేయాలని.. శాసన, పాలన వ్యవస్థ అధికారాలలోకి న్యాయవ్యవస్థ చొరబడటం రాజ్యాంగ మౌలిక వ్యవస్థకు విరుద్ధమని.. అన్నింటికీ మించి తమ రాజధానిని రాష్ట్రాలే నిర్ణయించుకోవడం సమాఖ్య వ్యవస్థకు నిదర్శనమని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది.   

రాష్ట్ర ప్రభుత్వానికి తమ రాజధాని నిర్ణయించుకునే సంపూర్ణ  అధికారం ఉంది. అలాగే.. ఒకే రాజధాని ఉండాలని ఏపీ విభజన చట్టంలో లేనప్పటికీ, చట్టానికి తప్పుడు అర్ధాలు చెప్తున్నారు కొందరు. రాజధానిపై శివరామకృష్ణన్ కమిటీ నివేదిక , జీ ఎన్ రావు కమిటీ నివేదిక, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు నివేదిక, హైపవర్డ్ కమిటీ నివేదికలను హైకోర్టు పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా.. రాజధానిని కేవలం అమరావతిలోని కేంద్రీకృతం చేయకుండా, వికేంద్రీకరణ చేయాలని ఈ నివేదికలన్నీ సూచించాయి కూడా. 

ఏపీ ప్రభుత్వం చెబుతోంది ఏమంటే.. 2014-19 మధ్య కేవలం అమరావతి ప్రాంతంలో 10 శాతం మౌలిక వసతుల పనులు మాత్రమే తాత్కాలికంగా జరిగాయి. అమరావతిలో రాజధాని నిర్మాణానికి 1,09,000 కోట్ల రూపాయలు అవసరం. రాజధాని వికేంద్రీకరణ ఖర్చు కేవలం రూ. 2000 కోట్లు పూర్తవుతుంది. రైతులతో జరిగిన అభివృద్ధి ఒప్పందాల్లో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదు. వికేంద్రీకరణ వల్ల అమరావతి అభివృద్ధి జరగదని భావించడంలో ఎలాంటి సహేతుకత లేదు. రైతుల ప్రయోజనాలన్నీ రక్షిస్తాం. అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుంది , ఆ మేరకు అక్కడ అభివృద్ధి జరుగుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement