VV ramana murthy
-
నాటకం మొదలైంది...!
ప్రజల చేతులు కాలాక పవన్ ఆకులు పట్టుకొస్తున్నారు. చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంతో రాజీపడిపోయిన సందర్భంలో కూడా ప్రజలను మభ్యపరి చేలా పవన్ మాటలు చూస్తుంటే మరో ‘ప్రజారాజ్యమే’ జనాలకు గుర్తొస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సార థ్యంలో కొనసాగిన ప్రత్యేక హోదా అనే సినిమా అయి పోయింది. జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ నాటకం మొద లైంది. అసలు విషయం పక్కన పడింది. అయోమయం అల ముకుంది. ప్రజలను తప్పుదోవ పట్టించడానికే పవన్ కల్యాణ్ నడుం బిగించారన్న విషయం కాకినాడ సభలో తేటతెల్లమైపోయింది. పవన్ కల్యాణ్ ఆత్మగౌరవ సభ తెలుగుదేశం పార్టీ మారువేషంలో ఏర్పాటు చేసిన సభగానే స్పష్టమైపోయింది. కేవలం బీజేపీని, ప్రధాని నరేంద్ర మోదీని, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుని టార్గెట్ చేస్తూ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన టీడీపీని బతికించడానికి చేసిన ప్రయత్నంగానే స్పష్ట మైంది. ఏపీకి ప్రత్యేకహోదాని కల్పించే విషయంలో అటు బీజేపీ, ఇటు టీడీపీ ఆడుతున్న దాగుడుమూతల్ని పవన్ తూర్పార పట్టలేకపోయారు. పవన్ నిర్వహించిన ఆత్మ గౌరవ సభ బాబు గౌరవసభగానే మిగిలిపోయింది. తెలుగు ప్రజల ఉజ్వల భవిష్యత్ కోసం మంచి నినాదం ఈ సభలో దొరుకుతుందని అందరూ ఆశించారు. కానీ నినాదం పక్కకు పోయి సినీఫక్కీని మించి ఉన్మాదం తీరులో పవన్ ప్రసంగం సాగింది. ఈ రాష్ట్రానికి దశ, దిశలను సూచించే మార్గం ఎక్కడా కనిపించలేదు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై చంద్రబాబు రాజీపడి ప్యాకేజీకి ఒప్పేసుకున్న విషయం అందరికీ స్పష్టంగానే అర్థం అయింది. తను తీసుకున్న నిర్ణయంవల్ల ప్రజల్లో తనకు అనుకూలంగా ఉందా? ప్రతికూలంగా ఉందా? అన్న విషయమై బాబు సర్వే కూడా చేసేసుకున్నారు. బీజేపీ ప్రభుత్వ నిర్ణయాన్ని ఏపీ ప్రజలు నిర్ద్వంద్వంగా వ్యతి రేకిస్తున్నారు. ఈ విషయం పవన్‌కి తెలుసు. అయినప్పటికీ ఈ నెపాన్ని ఒక్క బీజేపీ మీదకే నెట్టేసి బాబును గట్టె క్కించడానికి మారువేషంలో వచ్చిన ‘తమ్ముడు’గానే పవన్ బయట పడ్డారు. ప్రత్యేక హోదాపై బాబు గతంలో చేసిన ప్రకటనను గాని, ఇప్పటి ప్రకటనలను గాని పవన్ ప్రశ్నించలేక పోయారు. గత ఎన్నికల్లో టీడీపీకి ప్రచారం చేయడం కోసం తన అన్న చిరంజీవిని, తల్లిని, వదినను వదులు కుని ప్రాణాలకు తెగించానన్న పవన్ ఇప్పుడు బాబు నిర్ణయం వల్ల రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని ఎలుగెత్తి చాటలేకపోయారు. అయితే సినిమా డైలాగులు రాసు కొచ్చి నోటికొచ్చినట్టు ఉన్మాది స్టైల్ల్లో పవన్ పలికేసి వెళ్లిపో యారు. సమావేశానికి అశేష సంఖ్యలో వచ్చిన అభిమాను లకు గాని, టీవీల్లో చూసిన జనాలకుగాని పవన్ ఎందుకు ఈ ఆత్మగౌరవ సభ పెట్టారో అర్థం కాలేదు. ఈ స్పెషల్ స్టేటస్ గండం నుంచి బాబును తప్పించి ‘ఆత్మరక్షణ’ చేసు కునే సమావేశంగానే పవన్ మలిచారన్నది స్పష్టం. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ అధినేత బాబు ఆదేశాలు లేకుండా స్పెషల్ స్టేటస్ గురించి ఆందోళన చేయగలరా? మరి బాధ్యులైన బాబును విడిచిపెట్టి పవన్ కేవలం ఎంపీలు, ఎమ్మెల్యేలనే ఎందుకు టార్గెట్ చేశారు? స్పెషల్ స్టేటస్ రాకపోవడానికి బాబు బాధ్యతను పవన్ ఎందుకు ప్రశ్నించలేకపోయారు? ‘హోదా కోసం ప్రధాని మోదీని ప్రశ్నించడానికి బాబు భయపడుతున్నారా..? మీ మధ్య లొసుగులు ఏమైనా ఉన్నాయా?’ అని పవన్ తిరు పతి సభలో ప్రశ్నించారు. అయితే ఇప్పుడు పవన్ తీరును చూసిన తర్వాత, ‘బాధ్యత’ గల ముఖ్యమంత్రిగా ఉన్న బాబును పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదని, వీరిద్దరి మధ్యా లొసుగులు ఏమైనా ఉన్నాయా..? అని ప్రజలకు అనుమానం కలుగుతోంది. ప్రజల చేతులు, మూతులు కాలాక పవన్ ఆకులు పట్టుకు వస్తున్నారు. ఆయనకిది కొత్తకాదు. అమరావతి భూముల విషయంలో పవన్ బాధిత రైతులతో కలసి చిన్నపాటి సమావేశంతో హడావుడి చేశారు. అప్పుడు బాబు పవన్‌కు కండువా వేసి తిరుపతి ప్రసాదం ఇచ్చి పంపారు. తర్వాత రాజమండ్రి పుష్కరాల సమయంలో బాబు హారతి షూటింగ్ సందర్భంగా 27 మంది అమా యక ప్రజలు బలైపోయిన సందర్భంలో పవన్ వచ్చి అది ‘అసాంఘిక శక్తుల పనే’ అంటూ నాలుగు డైలాగ్‌లు చెప్పి వెళ్లిపోయారు. ఇప్పుడు మళ్లీ హోదా స్క్రిప్ట్‌తో వచ్చారు. ఇలా రావడం... నాలుగు డైలాగ్‌లు చెప్పడం.. వెళ్లిపోవడం పవన్‌కు పరిపాటే. ఇదంతా ‘సేమ్ టు సేమ్’ గానే పవన్ కొనసాగిస్తున్నారు. కేంద్రం ఇచ్చిన ప్యాకేజీని చంద్రబాబు అంగీకరిం చారు. శాసన మండలిలో సుదీర్ఘ ప్రసంగం చేసి ప్యాకేజీని స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. హోదా లేకుండా ప్యాకేజీని స్వాగతించడమేమిటంటూ పవన్ ఒక్క డైలాగ్ కూడా చెప్ప కపోవడాన్ని ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు. జనంలో జనసేన మీద పెరిగిన అనుమానాలను కాకినాడ సభ నిజం చేసిందని చెప్పక తప్పదు. బీజేపీతో టీడీపీ విడి పోతే దాన్ని కొమ్ము కాయడానికే జనసేన సిద్ధంగా ఉన్నట్టు పవన్ చెప్పకనే చెప్పేశారు. చివరికి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ రాజీనామా చేస్తే ‘నేనే’ అక్కడ కూర్చుని గెలిపిస్తా నని పవన్ ప్రకటించేశారు. ఒక పక్క బాబు స్పెషల్ స్టేటస్ విషయంలో కేంద్రంతో రాజీపడిపోయిన సందర్భంలో కూడా పవన్ ప్రజలను మభ్యపరిచే మాటలు చూస్తుంటే మరో ‘ప్రజారాజ్యమే’ జనాలకు గుర్తొస్తోంది. వి.వి. రమణమూర్తి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు మొబైల్ : 93485 50909 -
భూయజమానులు వస్తే చూద్దాం: సుప్రీం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అక్రమాలు చోటుచేసుకున్నాయని దాఖలైన ప్రజాహిత వాజ్యంపై సుప్రీం కోర్టు స్పందిస్తూ భూయజమానులు వస్తే చూద్దామని వ్యాఖ్యానించింది. ఈ అంశంపై ప్రజాహిత వాజ్యాన్ని విచారణకు స్వీకరించలేమంటూ తోసిపుచ్చింది. ప్రముఖ సంపాదకులు ఎ.బి.కె.ప్రసాద్, జర్నలిస్టు వి.వి.రమణమూర్తి, న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్ ఈ పిటిషన్ దాఖలు చేయగా శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్.ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది అరుణేశ్వర్ గుప్తా తొలుత వాదనలు ప్రారంభించగా ప్రధాన న్యాయమూర్తి కల్పించుకుని ‘మీరు రైతుల తరపున పిటిషన్ దాఖలు చేశారా..’ అని ప్రశ్నించారు. దీనికి న్యాయవాది స్పందిస్తూ ‘జర్నలిస్టుగా ప్రజాహిత వ్యాజ్యం దాఖలుచేశాం’ అని తెలపగా.. భూయజమానులు వస్తే చూద్దాం అంటూ ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. ప్రజాహిత వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించలేమని పేర్కొన్నారు. ఈనేపథ్యంలో న్యాయవాది తిరిగి వాదనలు ప్రారంభిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా సింగపూర్ దేశంతో ఒప్పందాలు కుదుర్చుకుంటోందని, అక్కడి సంస్థలకు రాజధాని నిర్మాణాన్ని అప్పగిస్తోందని పేర్కొన్నారు. దీనికి ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ ‘వారు రాజధానిని నిర్మించాలనుకుంటున్నారు. మీరు ఆపాలని అనుకుంటున్నారా?’ అంటూ ప్రశ్నించారు. దీనికి న్యాయవాది స్పందిస్తూ ‘ఇందులో అనేక అంశాలు ఇమిడి ఉన్నాయి. సారవంతమైన భూములను రైతులకు ఇష్టం లేకున్నా బలవంతంగా సేకరించారు. నిపుణుల కమిటీ చేసిన సిఫారసులను పట్టించుకోకుండా సారవంతమైన భూముల్లో రాజధాని నిర్మిస్తున్నారు..’ అంటూ వివరించబోయారు. ఈ వాదనలను వినలేమంటూ ధర్మాసనం పిటిషన్‌ను తోసిపుచ్చింది. -
ప్రత్యేక హోదా, ప్యాకేజీ రెండూ కావాలి
ఏపీ ప్రజలపై అలవిమాలిన భారం పడకుండా ఉండాలంటే 15 ఏళ్ల ప్రత్యేక హోదా, ప్యాకేజీ రెండూ ఉండాల్సిందే. రాజకీయాలకు అతీతంగా ప్రజలు ఉద్యమించి కేంద్రం మెడలు వంచాల్సిందే. లేదంటే ఏపీకి వర్తమానం, భవిష్యత్ రెండూ లేనట్లే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ ఇప్పుడు కేంద్రం దయాదాక్షి ణ్యాల మీద ఆధారపడి ఉంది. ఇక్కడి ప్రజలు తమ భవిత వ్యంపై చెందుతున్న ఆందోళ నపై కనీస ఆలోచన కూడా చేయడంలేదు. ఢిల్లీలోని మోదీ సర్కార్ ప్రత్యేక హోదాపై ఆశ లు కల్పిస్తూనే మంచి ప్యాకేజీ ఉంటుందని కాకమ్మ కబుర్లు చెబుతోంది. అప్పటి కాం గ్రెస్, ఇప్పటి బీజేపీ ప్రభుత్వాల ధోరణి ఏపీపై ఒకేలా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీని గొంతు నులిమి విసి రేస్తే బీజేపీ ప్రభుత్వం కొన ఊపిరిలో ఉన్న ఏపీని నాటు వైద్యంతోనో, ఆర్ఎంపీతోనో వైద్యం చేయించాలి అని ఆలోచిస్తోంది. ప్రత్యేక హోదా కల్పించకపోతే రాష్ట్రం అం ధకారంలోకి కూరుకుపోతుందన్న భయాందోళనలలో పలువురుప్రాణత్యాగాలకు సిద్ధమవుతున్నారు. టీడీపీ ప్రభుత్వం కంటి తుడుపు చర్యగా ప్రధానిని కలసి విజ్ఞా పన పత్రాలు ఇవ్వడం వరకే పరిమితమైంది. కేంద్రాన్ని గట్టిగా నిలదీసే పరిస్థితి కనబడటంలేదు. కనీసం రాష్ట్రం లో అఖిలపక్షం ఏర్పాటు చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకు వచ్చే ఉద్దేశం కూడా లేదు. మరోపక్క చంద్రబాబు ప్యాకే జీ వస్తుందని ప్రజలను మభ్యపెడుతున్నారు. కేంద్రాన్ని నిలదీసి ఏపీ డిమాండ్లను సాధించుకోవలసింది పోయి మోదీకి సలాములు చేసి వచ్చేస్తున్నారు. అఖిలపక్షాన్ని వేసి కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసే దిశగా నడుస్తోంది. ఇన్నే ళ్లూ పెట్టుబడులన్నీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే జరిగాయి. పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ కంపెనీలు, కేం ద్ర ప్రభుత్వ కార్యాలయాలు, హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటే రియట్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, విశ్వ విద్యా లయాలు, ఒకటేమిటి? సమస్తం జంట నగరాల్లోనే ఏర్పాటయ్యాయి. ఏపీలో కూడా అలాంటి అభివృద్ధి సాధించాలంటే ఒక్క ప్యాకేజీల వల్ల మాత్రమే సాధ్యం కాదు. ప్యాకేజీ అన్నది వెనుకబడి ఉన్న కొన్ని జిల్లాలకు పరిమితమవుతుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ సమగ్ర అభివృద్ధి జరగదు. ఉత్తరప్రదేశ్‌లో ముందేల్ఖం డ్ అభివృద్ధికి కేంద్రం 2009లో ప్యాకేజీ ఇచ్చినా అక్కడ జరిగిన అభివృద్ధి శూన్యం. 2009 నుంచి 2012 వరకూ రూ.1,212 కోట్లు విడుదలచేస్తే కేవలం 744 కోట్ల రూపా యలు మాత్రమే ఖర్చు చేశారు. ఈ నిధులు కూడా కేవ లం నీటి ఎద్దడి నివారణకు, నీటిపారుదల వ్యవస్థకు మాత్రం ఖర్చు చేయాలనే నిబంధన ఉంది. పైగా కేం ద్రం ఇచ్చే ప్యాకేజీ అందరికీ తెలిసిందే. చూడ్డానికి భారీగా లక్ష కోట్లుగానో, రెండు లక్షల కోట్లుగానో కనిపి స్తుంది. కానీ దాని లోతులకు వెళ్తేగాని అసలు రంగు బయటపడదు. ఉదాహరణకు 50 వేల కోట్లతో జాతీయ రహదారులు అభివృద్ధి అంటారు. మనం సంబర పడ తాం. కానీ ఈ 50 వేల కోట్లలో ఒక్క రూపాయి కూడా కేంద్రం ఖర్చు చేయదు. ప్రైవేటు కంపెనీయే పీపీపీ కింద కాంట్రాక్టు వేసుకొని రోడ్డు నిర్మిస్తుంది. దాన్ని కేం ద్ర సాయం అని అనగలమా? కేంద్రం మొత్తం ఆదాయం నుంచి 30 శాతం ప్రత్యే క హోదా రాష్ట్రాలకు కేటాయిస్తుంది. సాధారణ కేంద్ర సహాయం, అదనపు కేంద్ర సహాయం ప్రత్యేక కేంద్ర సహాయం అనే మూడు పద్దుల కింద గ్రాంటుల రూపం లో నిధులు ప్రతియేటా వస్తాయి. ఏ రకమైన పద్దుల కిం ద నిధులు విడుదల చేసినా అవి 90 శాతం గ్రాంటుల కిందకే వస్తాయి. రాష్ట్రాలు తిరిగి ఈ మొత్తాలను చెల్లించ నవసరం లేదు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు అవస రం మేర రుణాలను పొందే స్వేచ్ఛ కూడా ఉంటుంది. 90 శాతం గ్రాంటు, 10 శాతం రుణాల ఫార్ములాను కేం ద్ర ప్రాయోజిత పథకాలు, విదేశీ సాయంతో నడిచే పథ కాలకు వర్తింపజేస్తారు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రా లకు పలు రాయితీలు, పన్ను మినహాయింపులు, ఎక్సై జ్, కస్టమ్స్, ఆదాయపు పన్ను రేట్లు, కార్పొరేట్ పన్ను రేట్లలో మినహాయింపులు ఉంటాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలకు వెళ్లే నిధుల మొత్తం 2014-15లో 3 లక్షల 2 వేల కోట్ల రూపాయలు. రాష్ట్రాల వాటాను 42 శాతానికి పెంచిన తరువాత ఈ మొత్తం 2015-16లో రూ.3 లక్షల 71 వేల కోట్లకు పెరిగింది. అలాగే ఆర్థిక గ్రాంటుల ద్వారా రాష్ట్రాలకు 2014-15లో 55 వేల కోట్లు వస్తే, 2015-16లో 77 వేల కోట్లకు పెరి గింది. అంటే మొత్తం ఈ రెండు పద్దుల కింద రూ. 89 వేల కోట్ల మేరకు రాష్ట్రాలకు వచ్చే నిధులు పెరిగాయన్న మాట. దీన్నే కేంద్రం భూతద్దంలో చూపించి ప్రచారం చేసుకుంటోంది. కానీ ప్రతియేటా విడుదలయ్యే ప్లాన్ గ్రాంటులో కేంద్రం భారీ కోతను విధించింది. 2014- 15లో ఈ మొత్తం 2 లక్షల 61 వేల కోట్లు కాగా, 2015- 16లో ఇది లక్షా 39 వేల కోట్లకు తగ్గిపోయింది. అంటే ఒక లక్షా 22 వేల కోట్ల రూపాయల నిధులు తగ్గిపోయా యి. అదనపు నిధుల మాట దేవుడెరుగు రాష్ట్రాలకు రావలసిన అసలు నిధులే తగ్గిపోయాయి. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే 15 ఏళ్ల ప్రత్యేక హోదా, ప్యాకేజీ రెండూ ఉండాల్సిందే. ఇప్పటికే ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ ఢిల్లీలో ధర్నా చేశారు. అసెంబ్లీలో కూడా తన వాదనలు వినిపించారు. సెప్టెంబర్ 15 లోగా హోదా ప్రకటించక పోతే గుంటూరులో నిరవధిక నిరాహారదీక్ష చేపడతానని ప్రకటించారు. కాంగ్రెస్, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేస్తు న్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ముం దుకు నడవడం లేదు. ఈ సమయంలో ప్రజలు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రాజకీయాలకు అతీతంగా ఉద్యమించి కేంద్రం మెడలు వంచాల్సిందే. లేదంటే ఏపీకి వర్తమానం, భవిష్యత్ రెండూ లేనట్లే. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు, మొబైల్:9348550909 - వి.వి.రమణమూర్తి