రోడ్డు ప్రమాదాలను నివారించే దిశగా రాష్ట్ర రవాణా శాఖ అడుగులు వేస్తోంది. ఇందులోభాగంగా సరికొత్త నిబంధనలను అమల్లోకి తీసుకురానుంది.
సాక్షి, ముంబై: రోడ్డు ప్రమాదాలను నివారించే దిశగా రాష్ట్ర రవాణా శాఖ అడుగులు వేస్తోంది. ఇందులోభాగంగా సరికొత్త నిబంధనలను అమల్లోకి తీసుకురానుంది. బస్సులు, ట్రక్కులు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో మాత్రమే నడిచేవిధంగా పరిమితి విధించనున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం రవాణా శాఖ రెండు విధానాలను అమలు చేయనుంది. వేగాన్ని నియంత్రించే స్పీడ్ గవర్నర్స్‌తోపాటు ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్లను కొత్తగా తయారయ్యే వాణిజ్య వాహనాలు, బస్సుల్లో అమర్చనున్నారు. ఈ నిబంధనలను వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అమలు చేయనున్నారు.
ప్రతి ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో సగటున 13 వేల మంది మృత్యువాత పడుతున్నారు. వీటిని నియంత్రించేందుకు రవాణా శాఖ పలు నిబంధనలు విధించింది. రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ జారీ చేసిన ప్రకటన ప్రకారం.. అన్ని కొత్త రవాణా వాహనాలు పసుపు రంగు నంబర్ ప్లేట్లను కలిగి ఉండాలి. అదేవిధంగా వేగ నియంత్రణ పరికరాలను అమర్చుకోవాల్సి ఉంటుంది. దీంతో రవాణా శాఖ అధికారులు వీటిని సీల్ చేస్తారు. అయితే పురాతన వాహనాలకు వీటి నుంచి మినహాయింపు ఇచ్చారు. అంతేకాకుండా కొత్త బస్సుల్లో అంతర్గతంగా, బాహ్యంగా తప్పనిసరిగా సాంకేతిక పరమైన జాగ్రత్తలు ఉండాలి. గుర్తింపు పొందిన సంస్థలు పలు జాగ్రత్తలతో కూడిన బస్సులను తయారు చేయాల్సి ఉంటుంది.
ఇదిలా ఉండగా ఎక్స్‌ప్రెస్ హైవేలకు మాత్రమే వేగ నియంత్రణ పరికరాలు అనుకూలంగా ఉంటాయని రవాణా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇతర రోడ్లపై వాహనాన్ని వేగంగా నడపడంతో డ్రైవరు చూపు కోణం, ప్రతి స్పందన సమయం తక్కువగా ఉంటుందని డ్రైవింగ్ నిపుణులు పద్మకార్ హేలేకర్ తెలిపారు. దీంతో ఇతర రోడ్లపై గంటలకు 50 కి.మీ వరకు వేగ పరిమితిని విధించాలని సూచించారు.
ఇదిలా వుండగా 3,500 కి.లోల బరువు కన్నా తక్కువగా ఉన్న ద్విచక్రవాహనాలు, నాలుగు చక్రవాహనాలు, పోలీసు వాహనాలు, అంబులెన్సులు, అగ్ని మాపక వాహనాలు, ప్రభుత్వ అనుమతి ఉన్న వాహనాలకు వేగ నియంత్రణ పరికరాల నుంచి మినహాయింపు ఇచ్చారు. సర్వీస్ డోర్లు, అత్యవసర నిష్ర్కమణ ద్వారాలు, ప్రయాణికులకు అనుకూలంగా ఉండే సీట్లు, కిటికీలు, బస్సు ఫ్లోర్, ఎత్తు, మెట్లు తదితర అంశాల పట్ల ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని బస్సును తయారు చేయాల్సి ఉంటుందని రవాణా శాఖ అధికారులు సూచిస్తున్నారు.