రాష్ట్రంలో వెయ్యి ఉన్నత పాఠశాలల్లో వచ్చే నెల నుంచి టెలి విద్యను ప్రవేశ పెట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో వెయ్యి ఉన్నత పాఠశాలల్లో వచ్చే నెల నుంచి టెలి విద్యను ప్రవేశ పెట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఎడ్యుశాట్ ఉపగ్రహం, ఐఐఎంబీ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-బెంగళూరు) నిపుణుల సహకారంతో ఈ విద్యా బోధన ప్రారంభం కానుంది. ఇంత పెద్ద ఎత్తున ఉపగ్రహ ఆధారిత విద్యా బోధనను ప్రవేశ పెట్టడం ఇదే తొలిసారి. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో సైతం ఈ ప్రస్తావన ఉంది. ప్రధాన పాఠ్యాంశాలైన గణితం, విజ్ఞాన శాస్త్రం, ఇంగ్లీషులలో పిల్లల గ్రహణ శక్తిని పెంపొందించడానికి టెలి విద్యను ప్రవేశ పెట్టనున్నారు.
ఉపగ్రహం సాయంతో బహు మాధ్యమాల విధానం కింద ఈ విద్యా బోధన ఉంటుంది. యానిమేషన్, అనుబంధ చిత్రాలను ఈ విధానంలో సరళంగా ఉపయోగించవచ్చు. విద్యార్థులు సందేహాలను నివృత్తి చేసుకోవడానికి, ఉపాధ్యాయులతో చర్చించడానికి అవకాశం ఉంటుంది. బెంగళూరులోని టెలి విద్య ప్రధాన కార్యాలయం నుంచి ఏక కాలంలో వెయ్యి ఉన్నత పాఠశాలల్లో పాఠ్యాంశాలు ప్రసారమవుతాయి. టెలి విద్యకు సంబంధించి ఉపాధ్యాయులకు ప్రస్తుతం శిక్షణనిస్తున్నారు. ఈ వ్యవస్థను ఎలా వినియోగించాలో... వారికి బోధిస్తున్నారు. పాఠశాలల్లో సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం ఓ గంట, సాయంత్రం ఓ గంట తరగతులను నిర్వహిస్తారు. గ్రామాల్లో కరెంటు కోత సమస్యలున్నందున బ్యాటరీలను వినియోగించనున్నారు.
ప్రయోగాత్మక తరగతులు సక్సెస్
తుమకూరు జిల్లా గుబ్బి తాలూకాలోని 14 ఉన్నత పాఠశాలల్లో 2011లో ప్రయోగాత్మకంగా టెలి విద్యను ప్రవేశ పెట్టారు. ఐఐఎంబీ దీనిని పర్యవేక్షించింది. ప్రయోగం విజయవంతం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. ఈ పాఠశాలల్లో ఎస్‌ఎస్‌ఎల్‌సీలో ఉత్తమ ఫలితాలు వచ్చాయని, పిల్లల్లో ఆత్మ విశ్వాసం కూడా పెరిగిందని ఐఐఎంబీ అధికారులు తెలిపారు. ఫలితాలు కనీసం పది శాతం పెరిగాయని చెప్పారు. ఈ ప్రయోగం ఆధారంగా ఉన్నత పాఠశాలల విద్యలో సంస్కరణలు తీసుకు రావడానికి నివేదికను కూడా తయారు చేశామని వెల్లడించారు. ఈ సిఫార్సులకు ఆమోదం లభిస్తే గ్రామీణ, పట్టణ ప్రాంతాల విద్యలో మరింత ప్రగతిని సాధించవచ్చని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.