విజయం మీదే
- నూతనోత్సాహంతో ఉగాదికి స్వాగతం
- నగరంలో సందడే సందడి
సాక్షి, బెంగళూరు :ఆనందాల తీపి, అలకల పులుపు, కష్టాల చేదు, కోపతాపాల కారం.. ఇలా వివిధ రుచులు కలగలిపిన ఉగాది పచ్చడిలా మనిషి జీవితం కూడా అన్ని అనుభూతుల సమాహారం. అందుకే ఉగాది అంటే ఓ సరికొత్త సంవత్సరానికి ఆరంభం మాత్రమే కాదు, మనిషి జీవితం కష్ట సుఖాలు, జయాపజయాల సమాహారం అని తెలియజెప్పే సరికొత్త స్పూర్తికి ఆరంభం కూడా.
చెట్లన్నీ కొత్త చిగుళ్లను తొడుక్కొన్న ఆమని వసంతాన, కుహూ కుహూ కూతల కోయిలల సంగీతం నడుమ ‘జయ నామ’ సంవత్సరం అందరి ముం గిళ్లలో అడుగుపెట్టింది. ఉగాది పండుగను ఘనం గా జరుపుకునేందుకు నగర వాసులు సైతం సన్నద్ధమయ్యారు. దీంతో నగరంలోని ప్రముఖ మార్కెట్లన్నీ పండుగ సందడితో కళకళల్లాడుతున్నాయి.
ముఖ్యంగా వేప, వేప పువ్వు, మామిడాకులతో పాటు అన్ని రకాల పూలు, పండ్ల ధరలకు రెక్కలొచ్చాయి. అయినా మార్కెట్లన్నింటిలో కొనుగోళ్లు హుషారుగానే సాగాయి. ఇక ఉగాది సందర్భంగా బెంగళూరుతో పాటు రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో ప్రత్యే క పూజలు కొగుతున్నాయి.