
ఆ గుర్రం ఖరీదు పాతిక లక్షలు
ఈరోడ్ జిల్లాలోని అంధియూరు జాతి గుర్రాల అమ్మకాలకు ప్రసిద్ధిగాంచింది.
అన్నానగర్: ఈరోడ్ జిల్లాలోని అంధియూరు జాతి గుర్రాల అమ్మకాలకు ప్రసిద్ధిగాంచింది. ఈ ప్రాంతంలో చాలా అరుదుగా లభించే షాండీ అనే జాతి గుర్రాలకు స్వదేశ - విదేశాల్లో మంచి ధర పలుకుతోంది. ఈ జాతి గుర్రాలు ఒక్కొక్కటి రూ. 25 లక్షల నుంచి రూ. 60 లక్షలకు అమ్ముడవుతుంటాయి. విదేశాల్లో అయితే వీటి ధర అక్షరాలా కోటి రూపాయలు. షాండీ గుర్రం 6.5 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇది ఎక్కువగా నలుపు రంగులో లభిస్తాయి. వీటిని ఎప్పుడుబడితే అప్పుడు బయటకు తీసుకొనిరారు.
గురునాథన్ స్వామి ఆలయ ఉత్సవంలో మాత్రమే స్థానికులకు ఈ అరుదైన గుర్రాలను చూసే అదృష్టం లభిస్తోంది. ఈ సంప్రదాయాన్ని అప్పటి రాజైన టిప్పుసుల్తాన్ ప్రవేశపెట్టాడు. వీటిలో కధియవారి, కాధురియా, నోఖ్రా, మర్వార్ అనే ఇతర జాతులున్నాయి. గురునాథన్ స్వామి ఆలయ ఉత్సవంలో దేశ- విదేశాల నుంచి వచ్చిన గిత్తలను, గొర్రెలను, గుర్రాలను వేలం పాటకు పెడతారు. షాండీ జాతిలో అతి ఎత్తైన గుర్రం 6.8 అడుగులుంటుంది. జన్మించిన 42 నెలలకే ఇవి 6.5 అడుగుల ఎత్తుకు ఎదుగుతాయి. ఈ సంతలో అమ్మే గొర్రె ఒక్కొక్కటి 28 నుంచి 30 కిలోల బరువు ఉంటుంది.