సాక్షి, న్యూఢిల్లీ: తమ నేత అజిత్‌సింగ్ బంగ్లా ఖాళీ చేయించేందుకు ఎన్డీఎంసీ ప్రయత్నించడాన్ని వ్యతిరేకిస్తూ ఆర్‌ఎల్‌డీ కార్యకర్తలు గురువారం హల్‌చల్ చేశారు. గడువు ముగిసిన తర్వాత కూడా అజిత్‌సింగ్ తన అధికార నివాసాన్ని ఖాళీ చేయకపోవడంతో ఎన్డీఎంసీ సదరు బంగ్లాకు ఈ నెల 13 నుంచి నీటిసరఫరా, విద్యుత్ సరఫరా నిలిపివేసింది. దీంతో ఎన్డీఎంసీ చర్యను ఖండిస్తూ ఢిల్లీకి నీటిసరఫరా నిలిపివేసేందుకు ఆర్‌ఎల్‌డీ కార్యకర్తలు ప్రయత్నించారు. అజిత్ బంగ్లాకు నీటిని నిలిపివేసిన మరుసటి రోజు నుంచే ఆర్‌ఎల్‌డీ ఢిల్లీకి నీటి సరఫరా బంద్ చేస్తామంటూ హెచ్చిరిస్తోంది.
అన్నట్లుగానే మురాద్‌నగర్ గంగానహర్ నుంచి ఢిల్లీకి సరఫరా అవుతున్న నీటిని నిలిపివేయడానికి గురువారం ఉదయం ప్రయత్నించారు. ఢిల్లీకి 38 కిలోమీటర్ల దూరంలో ఘాజియాబాద్ సమీపంలో గంగానహర్‌కు పెద్దమొత్తంలో కార్యకర్తలు చేరుకొని ఆందోళనకు దిగారు. నీటి సరఫరాను నిలిపివేసేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వందలమంది కార్యకర్తలు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వారిపై వాటర్ కేనాన్లు ప్రయోగించారు. లాఠీ చార్జీ కూడా చేశారు. ఈ ఘర్షణలో 20 మంది ఆందోళనకారులు గాయపడ్డారు. అజిత్ సింగ్, ఆయన కుమారుడు జయంత్‌సింగ్ లోక్‌సభ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత వారుం టున్న బంగ్లాను ఎన్డీఎంసీ ఖాళీ చేయించింది. అయితే ఈ బంగ్లాను తమ తండ్రి, మాజీ ప్రధానమంత్రి నివాసమున్న బంగ్లా అని, దానిని చరణ్ సింగ్ మెమోరియల్‌గా మార్చాలని అజిత్‌సింగ్ డిమాండ్ చేస్తున్నారు.
అజిత్ మద్దతుదారుల హల్‌చల్
Published Thu, Sep 18 2014 10:54 PM | Last Updated on Sat, Sep 2 2017 1:35 PM
Advertisement
Advertisement