ముంబై: నిషేధిత కేటమైన్ మాదకద్రవ్యాన్ని తువాళ్లలో నానబెట్టి కొరియర్ల ద్వారా ఆస్ట్రేలియాకు తరలించడానికి యత్నించిన ముగ్గురు ఆఫ్రికన్లను అరెస్టు చేశామని మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్సీబీ) శుక్రవారం ప్రకటించింది. కేటమైన్‌ను నానబెట్టిన 74 తువాళ్లను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది. నిందితులు ఎమ్మాన్యుయేల్, క్రిస్టియన్ జీకర్, లారిండో రమోస్‌ను ముంబైలో గురువారం అరెస్టు చేశామని తెలియజేసింది.
ఎమ్మాన్యుయేల్ దక్షిణ ముంబైలో నివాసముంటున్నాడని ఎన్సీబీ తెలిపింది. ఆపరేషన్ల సమయంలో రోగులకు మత్తు కలిగించడానికి డాక్టర్లు కేటమైన్‌ను ఉపయోగిస్తారు. దీనిని వినియోగించిన వారికి రకరకాల భ్రాంతులు కలుగుతాయి. అందుకే బార్లు, నైట్‌క్లబ్బుల్లో టీనేజ్ యువతి దీనిని వినియోగిస్తోందని ఎన్సీబీ తెలిపింది. ఇదిలా ఉంటే మరో రకం మాదకద్రవ్యం కొకైన్‌ను కలిగి ఉన్న కేసులో యశ్‌బిర్లా గ్రూపు ఉన్నతాధికారి ఆనంద్ వర్ధన్, మరో ఇద్దరిని కూడా ఎన్సీబీ అరెస్టు చేసింది. వీరికి కొకైన్ సరఫరా చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నామని ఎన్సీబీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 11న ఈ ముగ్గురిని ముంబైలోని ఒక హోటల్‌లో అరెస్టు చేశారు. వీరంతా ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. తాజాగా అరెస్టయిన ముగ్గురు ఆఫ్రికా జాతీయులకు స్థానిక కోర్టు ఈ నెల 20 వరకు ఎన్సీబీ కస్టడీ విధించింది. ‘భారత్‌లో వీళ్లు ఎక్కడి నుంచి కేటమైన్ తీసుకువచ్చారు.. ఇది వరకు ఎన్నిసార్లు దానిని విదేశాలకు రవాణా చేసేంది తెలుసుకునేందుకు నిందితులను ప్రశ్నిస్తాం’ అని ఎన్సీబీ అధికారి ఒకరు తెలిపారు.
తువాళ్లలో కేటమైన్ రవాణా
Published Fri, Jan 17 2014 11:13 PM | Last Updated on Thu, Mar 28 2019 6:23 PM
Advertisement
Advertisement