సాక్షి, చెన్నై: తూత్తుకుడిలో ఐదు యూనిట్లతో కూడిన థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఉంది. ఇక్కడ రోజుకు ఒక్కో యూనిట్‌లో 210 మెగావాట్లు చొప్పున 1050 మెగావాట్లు ఉత్పత్తి అవుతోంది. ఈ విద్యుత్ రాష్ట్ర అవసరాలకు వినియోగిస్తున్నారు. 1979-1991 మధ్య కాలంలో ఇక్కడ ఐదు యూనిట్లు ఏర్పాటు చేశారు. ఆనాటి సాంకేతిక పరిజ్ఞానంతోనే విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఈ యూనిట్లు నెలకొల్పి ఏళ్లు గడుస్తున్నందు వల్లనో లేక ఇతర సాంకేతిక లోపాల కారణంగానో తరచూ విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలుగుతోంది. పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తిని చూడలేని పరిస్థితి నెలకొంది. పాడైన యూనిట్‌ను సరిచేసే లోపలే మరొకటి పనిచేయకుండా పోతోంది. ఇటీవలే అన్ని యూనిట్లలోని పరికరాల్ని ఇంజినీర్లు క్షుణ్ణంగా పరిశీలించి వెళ్లారు. ఆయా యూనిట్లలో ఉత్పత్తి తీరును పర్యవేక్షించారు.
మరమ్మతులు
అన్ని యూనిట్లూ సక్రమంగా పనిచేస్తున్నాయన్న ధీమాతో ఉన్న అధికారులకు ఆదివారం షాక్ తగిలింది. తొలి యూనిట్‌లో శనివారం రాత్రి సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో సిబ్బంది మరమ్మతులు ప్రారంభించారు. అయితే ఈ ఫలితం మరో సమస్య తెచ్చి పెట్టింది. మూడు, నాలుగు యూనిట్లలోని పైపుల్లో బ్లాక్ ఏర్పడడంతో మూడు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని నిలుపుదల చేశారు. దీంతో 630 మెగావాట్ల ఉత్పత్తి నిలిచిపోయింది. ఒకే రోజు ఇన్ని మెగావాట్ల ఉత్పత్తి ఆగిన పక్షంలో ఆ భారం రాష్ట్రం మీద పడే పరిస్థితి ఏర్పడింది. ఇన్నాళ్లూ విద్యుత్ అవసరాలకు భిన్నంగా ఉత్పత్తి జరుగుతోంది. ఇప్పుడిప్పుడే ప్రజా అవసరాలకు తగ్గట్టుగా ఉత్పత్తి చేరువవుతోంది. ఈ సమయంలో తూత్తుకుడిలో మూడు యూనిట్లు పనిచేయకపోవడంతో విద్యుత్ గండం ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీపావళి సెలవుల్లో వెళ్లిన ఇంజినీర్లు, ఇతర సాంకేతిక నిపుణులు హుటాహుటిన తూత్తుకుడి చేరుకుని మరమ్మతు పనుల్లో నిమగ్నమయ్యూరు. సోమవారం లేదా మంగళవారం రాత్రిలోపు అన్ని యూనిట్లలో మరమ్మతులు పూర్తి చేయనున్నారు.
విద్యుత్ గండం
Published Mon, Nov 4 2013 12:18 AM | Last Updated on Sat, Sep 2 2017 12:15 AM
Advertisement
Advertisement