
టైం దగ్గరపడింది!
- హోంశాఖ మంత్రి కె.జె.జార్జ్‌ను ఆ స్థానం నుంచి తప్పించేందుకు యత్నం
- లాభిస్తుందన్న యోచనలో సీఎం సిద్ధరామయ్య
- ఈ నిర్ణయం వల్ల సొంత పార్టీలోనే వ్యతిరేకత తప్పదన్న ఆందోళన
సాక్షి, బెంగళూరు : రాష్ట్ర హోంశాఖ మంత్రి కే.జే జార్జ్‌ను ఆ స్థానం నుంచి తప్పించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతోపాటు కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ భావిస్తోందా? ఇందుకు ఆ పార్టీ వర్గాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర హోంశాఖలో అక్రమాలు పెరిగిపోయాయనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా కావలసిన ప్రాంతానికి బదిలీపై వెళ్లడానికి పోలీసు సిబ్బంది ఎక్కువ మొత్తం చెల్లించారని వాదన వినిపిస్తోంది.
ఈ క్రమంలో కోట్లాది రూపాయలు చేతులు మారాయని విపక్ష నాయకులు చాలా సార్లు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఇక చాలా ఏళ్లుగా రాష్ట్రంలో నిషేదానికి గురైన సింగిల్‌నెంబర్ లాటరీ, ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ వంటి చట్టవ్యతిరేక పనులు ప్రారంభమయ్యాయి. ఇక కరావళి ప్రాంతంలో ఉగ్రవాదుల కార్యకలాపాలు పెరగడం కూడా హోంశాఖ నిఘా వైఫల్యానికి కారణమనే అపవాదు ఉంది. హోంశాఖలోని ఉన్నతాధికారుల మధ్య సఖ్యత లేదనే విషయం ‘ఏడీజీపీ రవీంధ్రనాథ్’ ఘటనలో తేటతెల్లమయినట్లు విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
ఈ విషయంతో పాటు ఇక మహిళలు, పిల్లల పై అత్యాచారాలు జరుగుతున్న సమయంలో ఉన్నతస్థాయిలో ఉన్న హోంశాఖ మంత్రి కే.జే జార్జ్ ప్రవర్తించిన తీరు పై కూడా సొంత పార్టీ నాయకులే గుర్రుగా ఉన్నారు. ఇక చట్టసభలతో పాటు బయట కూడా ప్రభుత్వ చర్యలను సమర్థించేలా ఆయన వ్యవహరించడం లేదని వారు పేర్కొంటున్నారు. మొన్న శాసన మండలిలో అత్యాచారాలపై విపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో జార్జ్ తత్తరపాటుకు గురైనప్పుడు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కలుగజేసుకున్న వైనాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా దాదాపు ఐదు రోజులుగా చట్టసభల్లో ఈ అత్యాచారాల విషయమే చర్చకు వస్తోంది. విపక్షాల విమర్శలను తప్పించుకోవడానికి కే.జే జార్జ్‌ను హోంశాఖ మంత్రి స్థానం నుంచి తప్పించడం వల్ల కొంత ఉపయోగం ఉంటుందని సిద్దరామయ్య భావిస్తున్నారు. అయితే ఆ విధంగా చేయడం వల్ల సొంత పార్టీలో తనపై మరింత వ్యతిరేకత పెరిగే అవకాశం కూడా ఉందనే ఆలోచన సిద్ధరామయ్యకు లేకపోలేదు.
ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే కనీసం హోం మంత్రి స్థానం నుంచి తప్పించి ఇతర శాఖను కేటాయించవచ్చుననే వాదన కూడా ఉంది. ఏది ఏమైనా హోంశాఖ మంత్రి స్థానం నుంచి కే.జే జార్జ్‌ను పక్కకు తప్పించే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు.