సాక్షి, చెన్నై:జాలర్లపై దాడులు తమిళాభిమానులు, రాజ కీయ పార్టీల్లో ఆగ్రహాన్ని రగుల్చుతున్నాయి. శ్రీలంక పైశాచికత్వంపై రాజకీయ పక్షాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. చెరపట్టిన వారిని విడుదల చేయాలని పట్టుబడుతున్నాయి. ఈ పరిణామాలు తమను ఇరకాటంలో పడేస్తుండడంతో జాలర్ల విడుదలే లక్ష్యంగా బీజేపీ నేతలు ప్రయత్నాల్లో పడ్డారు. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌తో కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పొన్ రాధాకృష్ణన్ భేటీ అయ్యారు. రాష్ట్ర జాలర్లపై ఏళ్ల తరబడి శ్రీలంక సాగిస్తున్న పైశాచికత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేంద్రంలో అధికార మార్పుతో తమకు భద్రత దొరికినట్టేనని భావించిన రాష్ట్ర జాలర్లకు కన్నీళ్లే మిగులుతున్నారుు. విరామం తరువాత కడలిలోకి వెళ్లిన రోజు నుంచి శ్రీలంక సేనలు వీర విహారం చేస్తున్నాయి.
వరుస దాడులతో బెంబేలెత్తిపోయిన జాలర్లు కడలిలోకి వెళ్లడానికిసాహసించడం లేదు. తమకు భద్రత కావాలంటూ నిరవధిక సమ్మె బాటలో రామేశ్వరం, పాంబన్, రామనాథపురం జాలర్లు ఉండగా, వీరికి మద్దతగా గళం పెరుగుతోంది. తూత్తుకుడి, నాగపట్నం, కడలూరు, కన్యాకుమారి తీర జాలర్ల సంఘాలు తదుపరి కార్యాచరణపై సమాలోచనలో పడ్డారు. జాలర్ల సంఘాలు ఏకమవుతుండడంతో వీరికి అండగా నిలబడేందుకు రాజకీయ పక్షాలు సిద్ధమయ్యాయి. నేతల శివాలు: శ్రీలంక చర్యలను డీఎంకే అధినేత ఎం కరుణానిధి తీవ్రంగా ఖండించారు. జాలర్లను విడుదల చేయించేందుకు తక్షణం చర్యలు చేపట్టాలంటూ ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన సోమవారం లేఖాస్త్రం సంధించారు.
దాడులు పునరావృతం కాకుండా ఇప్పుడే అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి చేశారు. శ్రీలంక మెడలు వంచి తమిళ జాలర్లకు న్యాయం చేయాలని కోరారు. పీఎంకే నేత రాందాసు సైతం తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అధికార మార్పుతో తమకు భద్రత కల్గిందన్న ఆనందంలో ఉన్న జాలర్లకు చివరకు ఆవేదన మిగులుతోందని పేర్కొన్నారు. ఈ దాడుల పర్వానికి అడ్డుకట్ట వేయాలంటే శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేను, ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖను భారత ప్రధాని నరేంద్ర మోడీ తప్పు పట్టాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇక కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జికేవాసన్, టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞాన దేశికన్, ఎండీఎంకే నేత వైగో, నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్, సీపీఎం, సీపీఐల నాయకులు సైతం జాలర్లకు అండగా నిలబడుతూ శ్రీలంకపై తమ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సుష్మాతో భేటీ : జాలర్లపై వరుస దాడులు రాష్ట్రంలో తమను ఇరాకటంలో పడేస్తుండటంతో కమలనాథులు మేల్కొన్నారు. జాలర్ల విడుదలే లక్ష్యంగా కేంద్రంలోని తమ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే పనిలో పడ్డారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ ఉదయాన్నే ఢిల్లీలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌తో భేటీ అయ్యారు. జాలర్లను విడుదల చేయించేందుకు చర్యలు తీసుకోవాలని కోరడంతో, అందుకు తగ్గ ప్రయత్నాల్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వేగవంతం చేసింది.
కోర్టుకు హాజరు : ఓ వైపు జాలర్లను విడుదల చేయించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుంటే, మరో వైపు శ్రీలంక సేనలు మాత్రం చేతికి చిక్కిన జాలర్లను కోర్టులో హాజరు పరిచే పనిలో పడ్డారు. 82 మందిని తలై మన్నార్ కోర్టులో, మరో 36 మంది గ్రామ భద్రతా కోర్టులో హాజరు పరిచారు.
అయితే, వీరిని సాయంత్రం వరకు రిమాండ్‌కు న్యాయమూర్తులు ఆదేశించినట్టు సమాచారం. ఇందుకు కారణం శ్రీలంకలోని భారత రాయ దౌత్య కార్యాలయ వర్గాలు వీరిని విడుదల చేయించేందుకు ప్రయత్నాల్లో నిమగ్నం కావడమే. అయితే, తమ దేశ ప్రభుత్వం నుంచి స్పష్టమైన అనుమతి వచ్చాకే విడుదల చేస్తామంటూ శ్రీలంక నావికాదళం స్పష్టం చేయడం గమనార్హం. విడుదలకు ఆదేశం : తమ దేశ నావికాదళం గుప్పెట్లో ఉన్న తమిళ జాలర్లను విడుదల చేయడానికి శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే ఆదేశాలు ఇచ్చారు. 78 మందిని విడుదల చేస్తున్నామంటూ రాజపక్సే తన ట్విట్టర్‌లో పేర్కొనడం విశేషం. ఈ దృష్ట్యా, ఆ 78 మందిని మంగళవారం శ్రీలంకలోని భారత దౌత్య కార్యాలయ వర్గాలకు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, మిగిలిన వారి విడుదల గురించి రాజపక్సే ఆదేశాలు ఇవ్వక పోవడం గమనించాల్సిందే.
లంక తీరుపై ఆగ్రహం
Published Mon, Jun 9 2014 11:34 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement