
ఆరేళ్లకే.. నూరేళ్లు
- సోమవారం తెల్లవారుజామున తిమ్మన్న మృతదేహం వెలికితీత
- పోస్టుమార్టం అనంతరం తల్లిదండ్రులకు అప్పగింత
- దుఃఖ సాగరంలో సూళికేరి
- అశ్రు నయనాలతో తుది వీడ్కోలు
- రక్షా బంధన్ రోజే దహన సంస్కారాలు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బాగలకోటె జిల్లా సూళికేరిలో బోరు బావిలో పడి మరణించిన ఆరేళ్ల తిమ్మన్నకు సోమవారం తొలి జాములో అంతిమ సంస్కారాలను నిర్వహించారు. అంతకు ముందు అత్యంత శక్తివంతమైన సక్షన్ మెషిన్, ఎయిర్ కంప్రెసర్లను ఉపయోగించి 172 అడుగుల లోతులో ఉన్న శవాన్ని వెలికి తీశారు. మరణానికి కారణాలు తెలుసుకోవడానికి విధిగా పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉన్నందున, మృతదేహాన్ని వెలికి తీయాల్సిందేనన్న రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ సూచించారు.
ఆ మేరకు ఆదివారం మధ్యాహ్నం నుంచే మృత దేహాన్ని వెలికి తీసే పనులు చేపట్టారు. సాయంత్రం వర్షం పడడంతో కాసేపు పనులు ఆపివేశారు. అనంతరం తెల్లవారుజామున రెండు గంటలకు మృతదేహాన్ని వెలికి తీశారు. అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం చిన్న గాజు పెట్టెలో మృతదేహాన్ని ఉంచి బంధువులకు అప్పగించారు. నిర్జీవంగా ఉన్న తిమ్మన్నను చూడగానే తల్లిదండ్రులు, బంధువుల ఆక్రందనలు మిన్నంటాయి రెండున్నర గంటలకు దహన సంస్కారాలు నిర్వహించారు.
జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఎస్‌ఆర్ పాటిల్, ఎమ్మెల్యేలు హెచ్‌వై మేటి, జీటీ పాటిల్, జిల్లా కలెక్టర్ మేఘన్ననవర్, ఇతర జిల్లా అధికారులు ఆ సమయంలో అక్కడే ఉన్నారు. తుమకూరు జిల్లాలోని శిరాకు చెందిన ప్రజా పనుల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ దొడ్డ రంగయ్య నాయకత్వంలో సక్షన్ మెషిన్, ఎయిర్ కంప్రెసర్లను వినియోగించారు. ఏటా రక్షా బంధన్ రోజు తిమ్మన్నకు రాఖీలు కట్టే అక్క చెల్లెళ్లు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. అదే రోజు అతని అంత్య సంస్కారాలు నిర్వహించాల్సి రావడంతో సూళికేరిలో విషాయ ఛాయలు అలుముకున్నాయి.
ఈ నెల మూడో తేదీన మధ్యాహ్నం తమ బంధువులకు విఫలమైన బోరును చూపించబోయిన తిమ్మన్న ప్రమాదవశాత్తు అందులో పడిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆరు రోజుల పాటు అతనిని వెలికి తీయడానికి 500 మంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. జిల్లా సర్జన్ అనంత రెడ్డి గత బుధవారం బోరు నుంచి దుర్వాసన వస్తున్నందున, తిమ్మన్న మరణించినట్లు నిర్ధారించారు.
అంతకు ముందు నుంచే సహాయక చర్యలను నిలిపి వేయాల్సిందిగా బాలుని తండ్రి హనుమంతప్ప అధికారులకు విజ్ఞప్తి చేశారు. తన కుమారుడు ఎలాగూ బతికి ఉండడు కనుక, పొలమైనా తనకు దక్కేట్లు చూడాలని విన్నవించాడు. సహాయక చర్యల వల్ల తమ భూములు కూడా నాశనమవుతున్నాయని పక్క పొలాల రైతులు ఫిర్యాదు చేశారు.
దీనికి తోడు సహాయక చర్యల్లో భాగంగా బోరుకు సమాంతరంగా తవ్వుతున్న గుంతలో బురద మట్టి రావడంతో సిబ్బంది ఆందోళన చెందారు. ఉన్నట్లుండి గుంత పూడుకు పోవచ్చని, తమ ప్రాణాలకు ముప్పు వాటిల్లవచ్చని భయాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి అధ్యక్షతన జరిగిన అధికారుల సమావేశంలో పనులను నిలిపి వేయాలని శనివారం నిర్ణయించారు. ఆ గుంతతో పాటు బోరు బావిని పూడ్చే పనులను కూడా సోమవారం చేపట్టారు.