వేశ్యావృత్తిని చట్టబద్ధం చేయండి
సాక్షి, బెంగళూరు :వేశ్యావృత్తిని చట్టబద్ధం చేయడం ద్వారా అసాంఘిక కార్యకలాపాలు తగ్గిపోతాయని ప్రభుత్వానికి ప్రముఖ సాహితీ వేత్త నిసార్ అహమ్మద్ సూచన చేశారు. వేశ్యా వృత్తి ఇతివృత్తంగా ఫొటో గ్రాఫర్ సుధీర్‌శెట్టి స్థానిక చిత్రకళాపరిషత్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు సంక్షేమ పథకాలు రూపొందిస్తున్నట్లు చెప్పుకుంటున్న ప్రభుత్వాలు విధిలేని పరిస్థితుల్లో వేశ్యా వృత్తిని చేపట్టిన వారిపట్ల వివక్ష చూపుతున్నాయని విమర్శించారు. చట్టబద్ధత కల్పించడం వల్ల ఈ వృత్తిలో ఉన్న వారికి తరుచుగా ఆరోగ్య పరీక్షలు చేయాల్సి ఉంటుందని, దీని వల్ల అనేక సంక్రమిక రోగాలను ముందుగానే అరికట్టేందుకు వీలవుతుందని చెప్పారు.
కాగా, ఇదే కార్యక్రమంలో పాల్గొన్న సమాచారశాఖ మంత్రి రోషన్‌బేగ్ ఈ విషయంపై స్పందిస్తూ... సింగపూర్ వంటి దేశాల్లో వేశ్యా వృత్తికి చట్టబద్దత ఉందన్నారు. అయితే ఇలాంటి చట్టాలను ఇక్కడ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొనాల్సి వస్తుందన్నారు.