ఆ చివరి ఆశయానికి సముచిత గౌరవం
దివంగత హరీష్ పేరుతో సంక్షేమ పథకం
రేపు ‘ముఖ్యమంత్రి సాంత్వన హరీష్ యోజన’ పథకం ప్రారంభించనున్న రాష్ట్ర ప్రభుత్వం
స్ఫూర్తిగా నిలచిన హరీష్ చివరి కోరిక
బెంగళూరు: రాష్ర్ట ప్రభుత్వం ఒక సాధారణ వ్యక్తి పేరుతో సంక్షేమ పథకం అమలు చేయడం మహా ఆరుదు. ప్రాణాలు పోతున్న చివరి క్షణంలో ఆ వ్యక్తి అసాధారణ తాపత్రయం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన నేపథ్యం ఆయన పేరుతో సంక్షేమ పథకం తీసుకురావడానికి కర్ణాటక ప్రభుత్వం సముచితమైన నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కూడా తాను చనిపోయే చివరి క్షణంలో కూడా అవయవదానం చేయాలని భావించిన హరీష్‌కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సముచిత గౌరవం ఇవ్వనుంది. ప్రభుత్వం రేపు (మంగళవారం) ఆయన పేరు మీదుగా ప్రమాద బాధితులను ఆదుకునేందుకు ఓ సంక్షేమ పథకాన్ని ప్రారంభించనుంది. నగరంలో ఇటీవల జరగిన రోడ్డు ప్రమాదంలో నగరంలో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న హరీష్ చనిపోయిన విషయం తెలిసిందే. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ఆయన శరీరం రెండు భాగాలైంది.
ఇక తాను బతకనని భావించి దగ్గరగా వచ్చిన వారితో ‘నా శరీరంలో ఏ అవయవం పనికి వస్తే ఆ అవయవాన్ని దానం చేయండి.’ అని అర్థించారు. విషయం తెలుసుకున్న వైద్యులు కుటుంబ సభ్యుల అనుమతితో ఆయన కళ్లు దానం చేశారు. ఆయన స్ఫూర్తితో స్వగ్రామమైన తుమకూరు జిల్లా, గుబ్బి తాలూకా కరెగౌడహళ్లి గ్రామ ప్రజలంతా తమ కళ్లను దానం చేయడానికి ముందుకు వ చ్చారు. ఇదిలా ఉండగా ప్రమాదంలో గాయపడిన ప్రజలకు సత్వర వైద్య సహాయం అందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ‘ముఖ్యమంత్రి సాంత్వన యోజన’ పేరుతో నూతన పథకాన్ని అమలు చేయాలని గతంలో భావించింది. గత జనవరి నెలలో ప్రారంభం కావాల్సిన ఈ పథకం వివిధ కారణాల వాయిదా పడుతూ వస్తోంది. చివరికి రేపు ఈ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో హరీష్ తన చివరి క్షణంలో కూడా అవయవదానం చేయడానికి ముందుకు రావడమే కాకుండా ఎంతోమందికి ఈ విషయంలో ప్రేరణగా నిలిచారని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ముఖ్యమంత్రి సాంత్వన యోజన పేరును ‘ముఖ్యమంత్రి సాంత్వన హరీష్ యోజన’ పేరుతో ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి యూ.టీ ఖాదర్ ధ్రువీకరించారు.
‘ముఖ్యమంత్రి సాంత్వన హరీష్ యోజన’ ఇలా పనిచేస్తుంది
►రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో గాయపడిని వారు ఆసుపత్రిలో చేరిన మొదటి 48 గంటలు చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించనుంది. గరిష్టంగా రూ.25 వేల వరకూ ఖర్చు పెడుతుంది.
►బాధితులు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి నేరుగా ఈ పథకం ద్వారా నిధులు అందజేస్తారు.
► చిన్న గాయాలు మొదలుకుని మొత్తం 25 రకాల చికిత్సలకు ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందుతుంది. అగ్ని ప్రమాదాల్లో గాయపడిన వారికి కూడా ఈ పథకం ద్వారా సాయం అందుతుంది.
►ఈ విషయంపై మరింత సమాచారం కోసం 108, లేదా 104లను సంప్రదించవచ్చు.