దొడ్డబళ్లాపురం, న్యూస్‌లైన్ :భారత ప్రభుత్వ మానవ వనరుల మంత్రిత్వ శాఖచే ‘ఎ’ కేటగిరి విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందిన గీతం యూనివర్సిటీ బెంగళూరు గ్రామీణ జిల్లా దొడ్డబళ్లాపురం వద్ద ఇంటర్నేషనల్ క్యాంపస్‌ను ప్రారంభించనుందని ఆ వర్సిటీ ఉపకులపతి ఆచార్య జి.సుబ్రహ్మణ్యం తెలిపారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కర్ణాటక ప్రభుత్వం అనుమతితో సోమవారం ఉదయం మధ్యాహ్నం మూడు గంటలకు కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు చేతుల మీదుగా వర్సిటీ నూతన భవన సముదాయాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాసప్రసాద్‌తో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నారని అన్నారు. గీతం బెంగళూరు క్యాంపస్‌లో బీటెక్, ఎంబీఏ కోర్సులను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వర్సిటీలో 25 శాతం సీట్లను మెరిట్ ఆధారంగా కర్ణాటక విద్యార్థులకు కేటాయించినట్లు వివరించారు. ఇంజినీరింగ్ కోర్సుల ప్రవేశానికి గాను 2014 ఏప్రిల్ 17 నుంచి మే 8 వరకూ దేశ వ్యాప్తంగా 36 కేంద్రాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. వీటిలో బళ్లారి, దావణగెరె, మంగళూరు, మైసూరు, రాయచూరు, తుమకూరు, బెంగళూరు సిటీతో పాటు దొడ్డబళ్లాపురంలోని గీతం విశ్వవిద్యాలయంలో ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష ఉంటుందని అన్నారు.
ప్రవేశపరీక్షల్లో తొలి పది ర్యాంకర్లకు ఉచిత విద్యనందిస్తామని అన్నారు. ప్రవేశ పరీక్ష దరఖాస్తులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, కరూర్ బ్యాంక్‌లలో లభిస్తాయన్నారు. ప్రవేశ పరీక్ష ఫలితాలను 2014 మే 15న ప్రకటిస్తామని అన్నారు. బీటెక్‌లో ఐటీ, కంప్యూటర్ సైన్స్, సివిల్, మెకానికల్, ఎలెక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ కోర్సులు బెంగళూరు క్యాంపస్‌లో ఉంటాయని అన్నారు. విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలతో కూడిన ప్రత్యేక వసతి సదుపాయం కల్పించినట్లు వివరించారు.
గీతం విశ్వవిద్యాలయం నుంచి నాలుగు సంవత్సరాలలో 5 వేల మంది విద్యార్థులకు ఉద్యోగాలు లభించాయని చెప్పారు. విశాఖ స్టీల్‌ఫ్లాంట్, రెడ్డీస్ ల్యాబ్, ఎరిక్‌సన్ ఇండియా, ఐబీఎమ్ తదితర సంస్థలతో గీతం విశ్వవిద్యాలయం అవగాహనా ఒప్పందాలను కలిగి ఉందన్నారు.
విలేకరుల సమావేశంలో బెంగళూరు స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ విజయభాస్కర్, రాజు, యూజీసీ డెరైక్టర్ ప్రొఫెసర్ సీహెచ్ రామకృష్ణ హాజరయ్యారు.
నేడు ‘గీతం’ క్యాంపస్ ప్రారంభం
Published Mon, Dec 23 2013 1:51 AM | Last Updated on Sat, Sep 2 2017 1:51 AM
Advertisement
Advertisement