కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల మధ్య కావేరి జలాలు సక్రమంగా పంపిణీ అయ్యేలా చూడడానికి కేంద్ర ప్రభుత్వం కావేరి నిర్వహణా మండలిని...
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల మధ్య కావేరి జలాలు సక్రమంగా పంపిణీ అయ్యేలా చూడడానికి కేంద్ర ప్రభుత్వం కావేరి నిర్వహణా మండలిని ఏర్పాటు చేయబోతున్నదన్న వార్తలు వెలువడిన నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నాయకత్వంలో అఖిల పక్షం మంగళవారం ఉదయం 11 గంటలకు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలవనుంది.
దీనికి ముందు కర్ణాటక భవన్‌లో సీఎం రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలకు అల్పాహార విందు ఇవ్వనున్నారు. ఢిల్లీకి వెళ్లే విషయమై చర్చించడానికి సీఎం సోమవారం సాయంత్రం ఇక్కడ విధాన సౌధలో అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కావేరి నిర్వహణా మండలి అనవసరమని అన్నారు.
కావేరి జలాల పంపంకంపై ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కర్ణాటక ఇదివరకే సుప్రీం కోర్టులో అప్పీలుకు వెళ్లిందని తెలిపారు. పైగా సుప్రీం కోర్టే కావేరి మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసిందని గుర్తు చేస్తూ, ఇలాంటి పరిస్థితిలో కొత్తగా కావేరి నిర్వహణా మండలి అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. రాష్ట్రానికి చెందిన నలుగురు కేంద్ర మంత్రులకు కూడా ఆహ్వానాలు పంపామని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే విషయంలో అన్ని పార్టీలు ఏకతాటిపై నిలవాలని, ఇలాంటి తరుణంలో రాజకీయాలు వద్దని ఆయన కోరారు.
నేనూ వెళతా : ప్రధాని కలవడానికి రావాల్సిందిగా తన కు ఆహ్వానం అందిందని, కనుక అఖిల పక్షం బృందంలో తానూ ఉంటానని జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ. దేవెగౌడ తెలిపారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడానికి ఎవరితో కలవడానికైనా తాను సిద్ధమేనని చెప్పారు. ఇదివరకే తాను ప్రధానిని కలసి కావేరి నిర్వహణా మండలిని ఏర్పాటు చేయవద్దని కోరానని తెలిపారు.