రేపు లోక్ అదాలత్ | Tomorrow Lok Adalat | Sakshi
Sakshi News home page

రేపు లోక్ అదాలత్

Published Fri, Dec 5 2014 2:48 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

Tomorrow Lok Adalat

చెన్నై, సాక్షి ప్రతినిధి:కోర్టులో ఏళ్లతరబడి పేరుకుపోయి ఉన్న కేసులకు ఈనెల 6వ తేదీన పరిష్కారం చెప్పనున్నారు. సుప్రీం కోర్టు ఆదేశానుసారం భారీ లోక్ అదాలత్‌ను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు తమిళనాడు న్యాయశాఖ సభ్య కార్యదర్శి, న్యాయమూర్తి ఆర్‌ఎమ్‌డీటీ రామన్ తెలిపారు. గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కొలిక్కిరాని కేసులకు సామరస్య ధోరణిలో పరిష్కారం చూపడమే లోక్ అదాలత్ నిర్వహణలోని ప్రధాన ఉద్దేశమన్నారు. గత ఏడాది నవంబరు 23న నిర్వహించిన లోక్ అదాలత్ రాష్ట్రంలో రూ.1.14 కోట్ల విలువైన 13,77,252 కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదీన జాతీయ స్థాయిలో జరిగిన లోక్‌అదాలత్ ద్వారా రూ.940 కోట్ల విలువైన 15 లక్షలా 8 వేల 767 కేసులకు పరిష్కారం లభించినట్లు తెలిపారు. లోక్ అదాలత్‌లు ముగిసిన వెంటనే నగదును బాధితులకు పంపిణీ చేసినట్లు చెప్పారు. ఈనెల 6వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న లోక్ అదాలత్ కోసం 300 బెంచ్‌లు ఏర్పాటు చేసి 300 న్యాయమూర్తులను నియమించినట్లు తెలిపారు. సుమారు 14 లక్షల కేసులకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నామన్నారు.
 
 4 వారాల్లోగా లోకాయుక్తా
 లోకాయుక్తా న్యాయస్థానం ఏర్పాటులో జరిగిన జాప్యంపై ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయ వేసింది. నాలుగువారాల్లోగా లోకాయుక్తా న్యాయస్థానం ఏర్పాటు పనులు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని ప్రధాన న్యాయమూర్తి గురువారం ఆదేశించారు. కాంచీపురం జిల్లా కీళ్‌మరవత్తూరు గ్రామానికి చెందిన ఆర్ కన్నన్ గోవిందరాజులు ఇటీవల మద్రాసు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. కేంద్రం 2013లో లోక్‌పాల్, లోకాయుక్తా చట్టాన్ని తీసుకురాగా, ఈ ఏడాది జనవరిలో పార్లమెంటులో ఆమోదం పొందిందని పిటిషన్ దారు పేర్కొన్నారు. జనవరి 16వ తేదీన దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిందన్నారు.
 
 అనేక రాష్ట్రాల్లో లోకాయుక్తా న్యాయస్థానాలు పనిచేయడం ప్రారంభించినా రాష్ట్రంలో ఆ ఊసేలేదని కోర్టుకు విన్నవించారు. డిసెంబరు 16వ తేదీ నాటికి లోకాయుక్తా న్యాయస్థానాల ఏర్పాటు గడువు పూర్తి అవుతుందని చెప్పారు. లోకాయుక్తా న్యాయస్థానాల్లో ముఖ్యమంత్రులు, మంత్రులను సైతం అవినీతిపై నిలదీసే అవకాశం ఉంటుందన్నారు. లోకాయుక్తా ఏర్పాటును కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఏప్రిల్లో వినతిపత్రం సమర్పించినా స్పందించనందున కోర్టును ఆశ్రయించినట్లు పిటిషన్ దారుడు కన్నన్ వివరించారు. ఈ పిటిషన్ గురువారం హైకోర్టు ముందుకు రాగా ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి మహాదేవన్ విచారించారు. నాలుగువారాల్లో లోకాయుక్తా న్యాయస్థానం ఏర్పాటు పనులను ప్రారంభించాలని ఆదేశించారు.  

 

Related News By Category

Related News By Tags

Advertisement