నేడు యువరాజ్ లొంగుబాటు | tomorrow yuvraj surrender in nammal cb cid office | Sakshi
Sakshi News home page

నేడు యువరాజ్ లొంగుబాటు

Published Sun, Oct 11 2015 3:18 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

నేడు యువరాజ్ లొంగుబాటు - Sakshi

నేడు యువరాజ్ లొంగుబాటు

 కనిపిస్తే కాల్పులు, పీటీ వారెంట్ ప్రభావం
  నామక్కల్ సీబీసీఐడీ కార్యాలయానికి యువరాజ్
  ధ్రువీకరించిన న్యాయవాది

 
 చెన్నై, సాక్షి ప్రతినిధి: ఇంజనీర్ గోకుల్‌రాజ్ హత్యకేసులో ప్రధాన నిందితుడిగా అజ్ఞాతంలో ఉన్న యువరాజ్ ఆదివారం సీబీసీఐడీ పోలీసుల ముందు లొంగిపోనున్నారు. ఈ విషయాన్ని ఆయన న్యాయవాది శనివారం ప్రకటించారు. సేలం జిల్లా ఓమలూరుకు చెందిన ఇంజనీర్ గోకుల్‌రాజ్ జూన్ 23వ తేదీన హత్యకు గురికాగా, ఈ కేసులో ఇప్పటికి 18 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన ముద్దాయి యువరాజ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. యువరాజ్‌ను అరెస్ట్ చేసేందుకు మూడు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో గోకుల్‌రాజ్ హత్యకేసును విచారిస్తున్న నామక్కల్ జిల్లా తిరుచెంగోడు డీఎస్పీ విష్ణుప్రియ (27) గత నెల 18వ తేదీన ఆత్మహత్య చేసుకోవడం ఇంజనీర్ హత్య కేసును తీవ్రతరం చేసింది.
 
 డీఎస్పీ విష్ణుప్రియ హత్యకేసు విచారణలో ఉన్న పోలీసుల చర్యలను నిరసిస్తూ అజ్ఞాతం నుంచే యువరాజ్ వాట్సాప్ ద్వారా ఆడియో మెసేజ్‌లు పంపేవాడు. దీంతో ఒక హత్యకేసు, మరో ఆత్మహత్యకేసు వెనకాల యువరాజ్ పాత్రపై పోలీసులకున్న అనుమానాలు బలపడ్డాయి. దీంతో యువరాజ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసుశాఖ సీబీసీఐడీ అధికారులకు ఆదేశాలు జారీచేయగా, నామక్కల్ మొదటి మెజిస్ట్రేట్ నేరవిభాగ కోర్టు న్యాయమూర్తి మలర్మతి యువరాజ్ అరెస్ట్ కోసం 5వ తేదీన పీటీ వారంట్ జారీచేశారు. పీటీ వారెంట్ జారీ అయినందున యువరాజ్ తప్పనిసరిగా కోర్టులో లొంగిపోవాల్సి ఉంది. లేకుంటే పరారీలో ఉన్న నిందితుడిగా అతనిపై అధికారిక ముద్రపడుతుంది.
 
 అంతేగాక అతని ఆస్తిపాస్తులు, బ్యాంకు ఖాతాలను సీజ్ చేసే అవకాశం ఉంది. యువరాజ్ తన రక్షణ కోసం మారణాయుధాలను ఉంచుకున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో అవసరమైతే యువరాజ్‌పై కాల్పులు జరిపైనా ప్రాణాలతో పట్టుకుని అరెస్ట్ చేయాలని 5వ తేదీన ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా యువరాజ్ న్యాయవాది అముదరసు శనివారం మీడియాతో మాట్లాడుతూ యువరాజ్ ఇంటి నుంచి సెల్‌ఫోన్, సీసీ టీవీ కెమెరా, హార్డ్‌డిస్క్, సిమ్‌కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈనెల 11 వ తేదీ ఉదయం 10 గంటలకు నామక్కల్ సేలం రోడ్డులోని సీబీసీఐడీ కార్యాలయంలో విచారణ అధికారుల ముందు యువరాజ్ లొంగిపోతాడని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement