కావేరీ జలాలపై కర్ణాటక వైఖరికి నిరసనగా చెన్నైలో ఒంటికి నిప్పంటించుకున్న విగ్నశ్
కర్ణాటక, తమిళనాడుపై సుప్రీం
న్యూఢిల్లీ: కావే రీ వివాదంలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల తీరుపై గురువారం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హింసకు అడ్డుకట్ట వేయడంలో ఇరు రాష్ట్రాలు విఫలమయ్యాయంది. కోర్టు తీర్పును పాటించాల్సిందేనని, ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోలేరని తేల్చిచెప్పింది. ఎలాంటి హింస, ఆందోళనలు, విధ్వంసం, ఆస్తి నష్టం లేకుండా చూడడం ఇరు రాష్ట్రాల బాధ్యతని నొక్కిచెపుతూ, శాంతి, నెమ్మది నెలకొనేలా చూడడంతో పాటు చట్టం పట్ల గౌరవం చూపాలని సూచించింది. సంబంధిత అధికారులు విజ్ఞతతో వ్యవహరించాలంటూ జస్టిస్ దీపక్ మిశ్రా, లలిత్‌ల ధర్మాసనం పేర్కొంది. శివకుమార్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 20 కు వాయిదా వేసింది.
తమిళనాడు బంద్‌కు ప్రతిపక్షాల మద్దతు
నేడు తమిళనాట బంద్ నేపథ్యంలో కన్నడ ప్రజల ప్రాణాలు, ఆస్తులకు భద్రత కల్పించాలంటూ ఆ రాష్ట్ర సీఎం జయలలితకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య లేఖ రాశారు. కొన్ని సంస్థలు తమిళనాడు బంద్‌కు పిలుపునివ్వడంపై తాను తీవ్రంగా ఆందోళన చెందుతున్నానని పేర్కొన్నారు. మరోవైపు చెన్నై నిరసనల్లో గురువారం విగ్నేశ్ నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. 93 శాతం కాలిన గాయాలతో చెన్నై ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న అతను బతికే అవకాశాలు తక్కువని వైద్యులు ప్రకటించారు.బంద్ నేపథ్యంలో చెన్నై, ఇతర ప్రాంతాల్లో సాయుధ బలగాలతో పాటు వేల మంది పోలీసుల్ని మెహరించారు. బెంగళూరులో సాధారణ పరిస్థితులు నెలకొన్నా నిషేధ ఉత్తర్వుల్ని కొనసాగిస్తున్నారు. 25 అర్థరాత్రి వరకూ 144 సెక్షన్‌ను పొడిగించారు.