రేపు 2 గంటల వరకు డెడ్‌లైన్!
- తమినాడుకు నీళ్లు వదిలారా? లేదా? చెప్పాల్సిందే
- కర్ణాటకకు సుప్రీంకోర్టు స్పష్టీకరణ
న్యూఢిల్లీ: కావేరి జలాల విడుదల విషయంలో తన ఉత్తర్వులను బేఖాతరు చేస్తున్న కర్ణాటక తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం మానుకోవాలని ఘాటుగా సూచించింది. పొరుగు రాష్ట్రం తమిళనాడుకు కావేరి నీళ్లు విడుదల చేశారా? లేదా? అన్నది మంగళవారం మధ్యాహ్నం 2 గంటలలోపు తనకు తెలియజేయాలని సర్వోన్నత న్యాయస్థానం డెడ్‌లైన్ విధించింది.
కావేరి జలాల పంపిణీ విషయంలో తమిళనాడు-కర్ణాటక మధ్య రాజీ కుదిర్చేందుకు సుప్రీంకోర్టు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. కానీ సుప్రీం ఆదేశాల మేరకు నీటి విడుదలకు కర్ణాటక ఒప్పుకోకపోవడంతో ఈ వివాదం ముదిరి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కావేరి రిజర్వాయర్లలోని నీటిని పరిశీలించేందుకు కేంద్రం కమిటీ ఏర్పాటుచేయాలని కర్ణాటక కోరుతున్నా.. కమిటీ ఏర్పాటుచేయడం వీలుకాదని, పరిశీలక కమిటీ ఏర్పాటు చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది.
తమ రైతుల కోసం కావేరి నీళ్లను అధికంగా విడుదల చేయాలని తమిళనాడు సుప్రీంకోర్టును ఆశ్రయించడం.. అందుకు న్యాయస్థానం ఒప్పుకోవడంతో కర్ణాటక ఆందోళన బాటపట్టింది. కావేరి నీళ్ల విషయమై బెంగళూరు సహా కర్ణాటక అంతటా ఆందోళనలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని నగరాలు నీటికొరత ఎదుర్కొంటున్న నేపథ్యంలో నవంబర్ వరకు తమిళనాడుకు నీళ్లు వదిలే ప్రసక్తే లేదని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అంటున్నారు.