
రెప్పపాటులో
ఉలిక్కిపడిన ప్రయాణికులు
ఉద్యాననగరిలో అప్పుడప్పుడే తెలతెలవారుతోంది. బెంగళూరులోని సిటీ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 6.25గంటలకు బయలుదేరిన బెంగళూరు-ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ రైలు సాఫీగా తన ప్రయాణాన్ని సాగిస్తోంది. అంతలోపే ఓ పెద్ద కుదుపు. వివిధ పనుల కోసం రైలులో బయలుదేరిన ప్రయాణికులు ఒక్కసారిగా ఏమైందో అర్థం కాక ఉలిక్కిపడ్డారు. చూస్తుండగానే రైలులోని డీ7, డీ8, డీ9, బీ6 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో గమ్యస్థానం చేరుకోకుండానే కొంతమంది ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోగా, అనేక మంది గాయాలతో ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. కర్ణాటక-తమిళనాడు సరిహద్దు ప్రాంతంలోని ఆనేకల్ వద్ద శుక్రవారం ఉదయం 7.30గంటలకు జరిగిన రైలు ప్రమాద ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు, ప్రమాదం నుంచి బయటపడిన వారితో పాటు మరికొంతమంది ముఖ్యుల స్పందన వారి మాటల్లోనే.....
- హొసూరు
నాకిది పునర్జన్మ
‘కోవైకు వెళ్లేందుకు ఉదయం బెంగళూరు-ఎర్నాకులం ట్రైన్ ఎక్కాను. డీ8 బోగీ లో నేను ఉన్నాను. ఆనేకల్ దగ్గరకు చేరుకోగానే ఓ పెద్ద శబ్దం వినిపించింది. అదే సమయంలో చాలా మంది హహాకారాలు చేశారు. అసలేం జరిగిందా అనుకొని తేరుకొని చూసేలోపు భోగీ మరో బోగీలోకి దూసుకుపోయి కనిపించింది. భోగీలో జ్యోతి అనే తోటి ప్రయాణికురాలు కాళ్లు విరిగింది. భోగీ తలుపు కుచించుకుపోయింది. ఇరుకైన తలుపు నుంచి బయటకొచ్చి క్షతగాత్రులను కాపాడే యత్నం చేశా. నాకిది పునర్జన్మ అనుకుంటున్నాను’
- సేతుకుమార్, ఐటీ ఇంజినీర్, ఎలక్ట్రానిక్ సిటీ, బెంగళూరు
మాటలు రావడం లేదు
‘బెంగళూరు నుంచి త్రిసూర్‌కు వెళ్లేందుకు డి. 9వ నంబర్ భోగీలో సీటు రిజర్వ్ చేయించుకున్నాను. ఉదయం 7.15-7.30 గంటల మధ్య భయంకరమైన శబ్దం వినిపించింది. డి. 9వ భోగి, డి.8 వ భోగీని ఢీకొంది. 9వ భోగీలోని ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. డి. 9వ భోగీలో సీట్లు ఖాళీ లేవు. బయటకు దిగిచూస్తే ఐదారు బోగీలు కుడిపక్క వాలిపోయి కనిపించాయి. ప్రమాదంలో మరణించిన వారు కనిపించగానే నోట మాటరాలేదు. గాయపడిన వారి ఆర్తనాదాలు ఇప్పటికీ చెవుల్లో మారుమోగుతున్నాయి.’ - సురేఖమ్యాథ్యూ, బెంగళూరు
నమ్మలేకపోతున్నాను
‘నేను డి1 బోగీలో ప్రయాణం చేస్తున్నాను. ఆనేకల్ వద్దకు చేరుకోగానే అనుకుంటా ఓ పెద్ద శబ్దం వినిపించింది. ఏం జరిగిందోనని భయపడుతూనే మా భోగీలో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. కిందకు దిగి చూశా డి. 8, డి.9 భోగీలు కుడిపక్కకు వాలి ఉన్నాయి. సంఘటనను దగ్గరి నుంచి చూసినా ఇప్పటికీృఆదశ్యాలను తలుచుకుంటే భయం వేస్తోంది. మాతో ప్రయాణిస్తున్న ఇంతమంది చనిపోయారంటే నమ్మలేకుండా ఉన్నాను’.
- జోసెఫ్, ఉపాధ్యాయుడు, ఆర్‌టీనగర్, బెంగళూరు