
దుర్గతో రాకేష్ రెడ్డి(ఫైల్)
పెళ్లికి నిరాకరణ
పరిహారంగా రూ.10 లక్షలకు ప్రామిసరీ నోట్లు
అతని తండ్రిని నిలదీసిన బాధితురాలు
పోలీస్ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు
పెనమలూరు: గతంలో అతని పేరు దుర్గారావు. అప్పట్లో ఓ వ్యక్తిపైన ప్రేమతో లింగమార్పిడి చేసుకుని ‘దుర్గ’ అయింది. తర్వా త ఆ వ్యక్తి దుర్గను కాదని మరో యువతిని పెళ్లిచేసుకున్నాడు. దుర్గ నిలదీయగా పరిహారంగా రూ. 10 లక్షలకు ప్రామిసరీ నోట్లు రాసిచ్చాడు. అనంతరం తప్పించుకు తిరుగుతున్నాడు. ప్రామిసరీ నోట్లకు గడువు ముగుస్తుడటంతో దుర్గ కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసులను ఆశ్రయించింది.
పోలీసుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన డోను దుర్గారావు 2007లో ఇంటర్ చదువుతుండగా రాకేష్‌రెడ్డితో పరిచయం ఏర్పడింది. వారు చాలాకాలం కలసి జీవించారు. దుర్గారావు 2010లో ముంబాయ్ వెళ్లి లింగమార్పిడి చేసుకుని దుర్గగా మారింది. రాకేష్‌రెడ్డిని దుర్గ వివాహం చేసుకోవాలనుకుంది. అయితే రాకేష్‌రెడ్డి 2014లో మరో యువతిని పెళ్లిచేసుకున్నాడు. ఆ సమయంలో రాకేష్‌రెడ్డిని దుర్గ నిలదీయగా అతను పెళ్లి చేసుకోలేనని చెప్పి.. పరిహారం కింద రూ. 10 లక్షలకు ప్రామిసరీ నోట్లు ఇచ్చాడు. తర్వాత దుర్గకు కనిపించకుండా తిరుగుతున్నాడు. ఆ నోట్లకు కాలం చెల్లిపోతుండటంతో దుర్గ పెనమలూరు మండలం కానూరులో నివసిస్తున్న రాకేష్‌రెడ్డి తండ్రి చిరంజీవిరెడ్డి ఇంటికి.. ఆయన పనిచేసే బ్యాంకుకు శుక్రవారం వెళ్లి రాకేష్‌రెడ్డి చిరునామా చెప్పాలని గొడవపడింది. దీంతో చిరంజీవిరెడ్డి పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని దుర్గ కూడా పోలీసులను ఆశ్రయించింది.
ఈ పరస్పర ఫిర్యాదులతో ఏమి చేయాలో పాలుపోక పోలీసులు తలపట్టుకున్నారు. ఒంగోలులో జరిగిన వ్యవహారం కాబట్టిSతాము ఏమీ చేయలేమని పెనమలూరు పోలీసులు దుర్గకు తెలిపారు. అయితే దుర్గ పట్టువీడలేదు. చివరకు పోలీసు ఉన్నతాధికారులు కల్పించుకుని బ్యాంకు వద్ద గొడవ చేసినందుకు దుర్గపై, ఆమెను మోసం చేసినందుకు రాకేష్‌రెడ్డిపై కేసులు నమోదు చేశారు. రాకేష్‌రెడ్డి కేసును ఒంగోలు బదిలీ చేస్తామని పోలీసులు తెలిపారు.