అక్కడ టీడీపీ టిక్కెట్ కోసం ముగ్గురు పోటీ పడుతున్నారట. గత ఎన్నికల్లో అక్కడ గెలిచింది వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి. అయితే టీడీపీలో ఒక మాజీ ఎమ్మెల్యే, మరో మాజీ ఎమ్మెల్సీ, ఓ మాజీ మంత్రి మనవడు టిక్కెట్ కోసం పడుతున్నారని టాక్. అభ్యర్థిని నేనే అంటూ ముగ్గురూ ప్రచారం చేసుకుంటున్నారట. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏదో, దాని కథేంటో చూద్దాం..
2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి, ఆ తర్వాత జరిగిన పంచాయతీ, పరిషత్, మున్సిపల్.. వరుసగా అన్ని ఎన్నికల్లో తెలుగుదేశం ఓడింది. రోజురోజుకు ప్రజలకు దూరంగా, భారంగా మారిన ఆ పార్టీ అధినేత చంద్రబాబు.. ఇప్పటికీ ఢంకా బజాయించడంలో మాత్రం తగ్గడం లేదు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామంటూ లేని బింకాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆయన బాగా నమ్మకం పెట్టుకున్న పాత కృష్ణా జిల్లాలోనే పరిస్థితి భిన్నంగా ఉంది. కృష్ణా జిల్లాలో పెనమలూరులో 2014లో టీడీపీ తరపున గెలిచిన బోడే ప్రసాద్ 2019లో ఓడిపోయారు. అయితే ఇప్పటికీ ఆయనే పెనమలూరు టీడీపీ ఇంఛార్జిగా కొనసాగుతున్నారు. పార్టీ నిర్వహించే అన్ని కార్యక్రమాలు ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. చంద్రబాబు సపోర్ట్ నాకే ఉంది రాబోయే ఎన్నికల్లో పెనమలూరు నుంచి పోటీచేసేది నేనే అంటూ బోడే ఇప్పట్నుంచే ప్రచారం చేసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు బోడే ప్రసాద్‌కు పోటీగా మరో ఇద్దరు లైన్‌లోకి వచ్చారట. మాజీ ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్ ఎప్పట్నుంచో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్నారు. గత నాలుగైదు ఎన్నికల నుంచి ప్రతిసారీ టిక్కెట్ కోసం చివరి వరకూ పోరాడటం.. భంగపడటం ఆయనకు అలవాటైంది. దేవినేని ఉమ మద్దతుతో ఈసారైనా టిక్కెట్ దక్కకపోతుందా అనే ఆశలో ఉన్నారాయన.
చదవండి: (Galla Jayadev: ఎంపీ అన్న సంగతే మరిచిపోయారేమో..?)
వీరిద్దరికీ పోటీగా చలసాని పండు మేనల్లుడు దేవినేని గౌతం కూడా 2024లో పెనమలూరులో పోటీచేసేది నేనే అని చెప్పుకుంటున్నాడు. లోకేష్ సపోర్ట్ తనకు ఉందని... టికెట్ తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. చిన్నబాబు తనకే హామీ ఇచ్చాడని, ఈ సారి పోటీ చేయడం ఖాయమంటున్నాడు.
ప్రస్తుతం పెనమలూరు నియోజకవర్గంలో ఈ ముగ్గురూ పార్టీ కార్యక్రమాలు వేర్వేరుగా నిర్వహస్తుండటంతో తమ్ముళ్లు అయోమయంలో ఉన్నారు. అసలే గెలుపుపై ఆశల్లేవు, ఆపై కుమ్ములాటలెందుకని ప్రశ్నిస్తున్నారు. పార్టీ అధిష్టానం పిలుపునిచ్చే ఏ కార్యక్రమంలోనూ ఈ ముగ్గురూ కలిసి పాల్గొనడం లేదట. మా రూటే సెపరేటంటూ విడివిడిగా కార్యక్రమాలు చేసుకుంటూ తమకే పార్టీ సపోర్ట్ ఉందని ప్రచారం చేసుకుంటున్నారట. ఈ ముగ్గురూ చాలదన్నట్లు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా చేసిన వడ్డే శోభనాద్రీశ్వర్రావు కుటుంబం నుంచి ఆయన మనవడు వడ్డే సాయి కూడా టికెట్ కోసం తెరవెనుక పావులు కదుపుతున్నట్లు తాజాగా ప్రచారం మొదలైంది.
ప్రస్తుతం పెనమలూరు టీడీపీలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు పార్టీ అధినేతకు తలనొప్పిగా మారుతున్నాయట. అసలే అవకాశాలు అంతంతమాత్రంగా కనిపిస్తున్న పెనమలూరులో టిక్కెట్ కోసం ఇప్పట్నుంచే ట్రయాంగిల్ ఫైట్ మొదలవ్వడంతో చంద్రబాబుకు ఏం చేయాలో పాలుపోవడం లేదట. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉన్న ఈ నియోజకవర్గాన్ని గాడిలో పెట్టడం ఎలా అని తలపట్టుకుంటున్నారట చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో గెలవడం సంగతి దేవుడెరుగు.. ముందు ఈ ముగ్గురినీ ఎన్నికల నాటికి ఒకే తాటిపైకి తేవడం ఎలా అని బాబోరు తెగ మదన పడిపోతున్నారట.
చదవండి: (Daggubati Purandeswari: కాలం చెల్లినట్లేనా?.. బీజేపీ ఏదో ఆశిస్తే.. జరిగిందేదో!)
Comments
Please login to add a commentAdd a comment