సాక్షి ప్రతినిధి, చెన్నై: కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలకు మధ్య అధికారిక రాయబారిని సిద్ధం చేసుకుంటోంది అన్నాడీఎంకే ప్రభుత్వం. పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ను రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక మంత్రిగా కేంద్ర, రాష్ట్ర రాజధానుల మధ్య వారధిగా నియమించనున్నట్టు సమాచారం. సీఎంతో సమానంగా ప్రభుత్వంలో మరో పవర్ పాయింట్ రూపుదిద్దుకుంటోంది. జయలలిత మరణం తరువాత పార్టీ, ప్రభుత్వాల్లో చక్రం తిప్పాలనుకున్న చిన్నమ్మకు సీఎం సీటు తృటిలో చేజారిపోయింది. అక్రమాస్తుల కేసులో అనూహ్యరీతిలో ఆమె జైలు పాలయ్యారు.
తన కనుసన్నల్లో మెలిగే ప్రభుత్వం ఏర్పడినా ప్రత్యక్ష పెత్తనం సాగించే అవకాశం లేకుండా పోయింది. దీంతో ప్రధాన కార్యదర్శి శశికళ తన ప్రతినిధి గా అక్క కుమారుడు దినకరన్‌కు ఉప ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టింది. బెంగళూరు పరప్పర అగ్రహార జైలు నుంచి శశికళ ఆదేశాలను దినకరన్ అమలు చేస్తున్నారు. పార్టీపై దినకరన్ పూర్తిస్థాయి పెత్తనం చెలాయిస్తున్నా ప్రభుత్వంతో అధికారిక సంబంధం లేకుండా పోయింది. ఇదిలా ఉండగా, రాష్ట్ర మంత్రులు దిండుగల్లు శ్రీనివాసన్, సెంగోట్టయ్యన్, కామరాజ్, సెల్లూరు రాజా మంగళవారం బెంగళూరు వెళ్లి శశికళను కలిశారు. ఈ సందర్భంగా పార్టీ, ప్రభుత్వానికి సంబంధించి శశికళ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రధాని కుర్చీలో మన్మోహన్ సింగ్‌ను కూర్చోబెట్టి పెత్తనమంతా పార్టీ అధ్యక్షురాలి హోదాలో సోనియాగాంధీ సాగించిన రీతిలో రాష్ట్ర రాజకీయాలను శాసించాలని శశికళ ఒక ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్రస్థాయిలో అలాంటి ప్రయత్నం వీలుకాదని శశికళకు సర్దిచెప్పారు.
ఇక తన మనిషిగా ఉన్న ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నా, ప్రభుత్వ కార్యకలాపాలకు దూరంగా ఉండక తప్పడంలేదనే కోణంలో శశికళ ఆలోచిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో దినకరన్‌కు అధికారిక హోదా కల్పించాలనే నిర్ణయానికి శశికళ వచ్చినట్లు సమాచారం. దినకరన్ కోసం కేబినెట్ మంత్రి హోదాలో ఒక నామినేటెడ్ పదవిని సృష్టించి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఢిల్లీలో ఉంచేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఢిల్లీలో తమిళనాడు భవన్‌లో కొంత భాగాన్ని దినకరన్ కార్యాలయంగా మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది.
తమిళనాడు ప్రభుత్వానికి సంబంధించి అన్నిరకాల లావాదేవీలపై కేంద్ర మంత్రులు, అధికారులకు దినకరన్ అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ప్రణాళిక సిద్ధం అవుతోంది. అలాగే రాష్ట్ర మంత్రులు, అధికారులు సైతం దినకరన్ అధికార పరిధిలోకి తీసుకురానున్నారు.చెన్నై సచివాలయంలో దినకరన్‌కు ఒక ప్రత్యేక కార్యాలయాన్ని సిద్ధం చేయనున్నారు. ఈ రకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిగా పనిచేసేందుకు దినకరన్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ రకంగా సీఎం ఎడపాడి పళనిస్వామితో సమానంగా ప్రభుత్వంలో మరో పవర్ పాయింట్ రూపుదిద్దుకుంటోంది. ఇందుకు సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన విడుదల అవుతుందని తెలుస్తోంది.
రాజధానుల రాయబారిగా దినకరన్
Published Thu, Mar 2 2017 3:41 AM | Last Updated on Tue, Sep 5 2017 4:56 AM
Advertisement