సాక్షి, ముంబై: నగరవాసుల కోసం రెండు ఫుట్‌బాల్ మైదానాలను అభివృద్ధి చేయాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నిర్ణయించింది. నెదర్లాండ్స్‌కు చెందిన ‘జాన్ క్రేఫ్ ఫౌండేషన్’ వారి భాగస్వామ్యంతో ఈ రెండు చిన్న ఫుట్‌బాల్ మైదానాలను అందుబాటులోకి తీసుకురానుంది. ఇటీవల జెఫర్‌వోన్‌తో జరిగిన సమావేశంలో నగర మేయర్ సునీల్ ప్రభు ఈ మైదానాలను అభివృద్ధి చేసే అంశాన్ని చర్చించారు. ‘ఈ ఫౌండేషన్ ప్రపంచంలోనే వివిధ నగరాలలో చాలా మైదానాలను అభివృద్ది చేసింది. నిరుపేదలైన ఏడు నుంచి 14 ఏళ్లలోపు పిల్లలకు అన్ని వసతులతో కూడిన ఆట మైదానాలను అందుబాటులో ఉంచుతాం.
వారు క్రీడల్లో రాణించేలా ప్రోత్సహించడమే తమ లక్ష్యమ’ని మేయర్ సునీల్ ప్రభు పేర్కొన్నారు. ఈ మైదానాలు అభివృద్ధి అయిన తర్వాత ఫౌండేషన్ ద్వారా ఈ మైదానాల చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల పేద పిల్లలకు ఉచితంగా కోచింగ్ కూడా ఇచ్చే ఏర్పాట్లు చేస్తామని ఆయన తెలిపారు.
కాగా, బీఎంసీ పరేల్‌లో ఉన్న సెయింట్ జేవియర్స్ మైదానం, పశ్చిమ బాంద్రాలోని పీ సెవెన్ మైదానాలను ఫుట్‌బాల్ మైదానాలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ మైదానాలకు క్రేఫ్ కోర్టులుగా నామకరణం చేస్తామని బీఎంసీ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఆట మైదానాలను అభివృద్ధి చేసి, వీటి నిర్వహణ బాధ్యతను కూడా ఆ ఫౌండేషన్‌కు కార్పొరేషన్ అప్పగించనుందని తెలిపారు.ఈ తరహా మరిన్ని మైదానాలను నగర శివారు ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేయనుందని ఆయన వివరించారు.
రెండు ఫుట్‌బాల్ మైదానాల అభివృద్ధి
Published Sat, Feb 15 2014 11:24 PM | Last Updated on Sat, Sep 2 2017 3:44 AM
Advertisement