Sunil Prabhu
-
మూడేళ్లలో ప్రపంచస్థాయి రోడ్లు
సాక్షి, ముంబై: వచ్చే మూడేళ్లలో ముంబై రహదారుల రూపురేఖలు మారనున్నాయి. నగరంలో ప్రపంచ స్థాయిలో (వరల్డ్ క్లాస్) నాణ్యమైన రహదారులు నిర్మించేందుకు మహానగర పాలక సంస్థ (బీఎంసీ) రూ. ఏడున్నర వేల కోట్లతో ‘రోడ్ మాస్టర్ ప్లాన్’ తయారు చేసింది. ఏటా వర్షా కాలంలో రోడ్లపై ఏర్పడిన గుంతలతో ప్రజలు, వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఈ ఇబ్బందుల నుంచి ముంబైకర్లకు విముక్తి కల్పించాలని బీఎంసీ మాస్టర్ ప్లాన్ తయారుచేసినట్లు మేయర్ సునీల్ ప్రభు చెప్పారు. ‘ముంబై రోడ్స్ మాస్టర్ ప్లాన్’ అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమానికి బీఎంసీ కమిషనర్ సీతారాం కుంటే, డిప్యూటీ మేయర్ మోహన్ మిట్భావ్కర్, సభాగృహం నాయకుడు తృష్ణ విశ్వాస్రావ్, స్థాయీ సమితి అధ్యక్షుడు యశోధర్ ఫణసే తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ కుంటే మాట్లాడుతూ రోడ్ల మరమ్మతులకు బీఎంసీ ఏటా కొన్ని కోట్లు ఖర్చు చేస్తున్నా వర్షా కాలంలో అవి అధ్వానంగా మారిపోతున్నాయన్నారు. దీంతో పటిష్టమైన రహదారులు నిర్మించాలని నిర్ణయించినట్లు చెప్పారు. కాగా, మూడేళ్ల కాలపరిమితిలో ఈ పనులు ఎలా చేపట్టాలి, ఎన్ని విడతల్లో పూర్తి చేయాలి తదితర ఈ పుస్తకంలో పొందుపర్చామన్నారు. ఇదిలాఉండగా పటిష్టమైన రోడ్లు నిర్మించేందుకు ఆర్థిక బడ్జెట్లో రూ.7500 కోట్లు మంజూరు చేశారు. ఆ ప్రకారం ఏటా రూ.2500 కోట్లు ఖర్చుచేసి సీసీ రోడ్లు, మాస్టిక్ అసఫల్ట్ రసాయనంతో పటిష్టమైన రహదారులు నిర్మించాలని సంకల్పించారు. టెండర్లను ఆహ్వానించకుండా ఏటా నగర రహదారులపై అధ్యయనం చేస్తారు. ఏ రోడ్డును, ఎన్ని రోజుల్లో పూర్తిచేయాలి ప్రణాళిక రూపొందించి ఆ ప్రకారం విడతల వారీగా పనులు చేపడతారని కుంటే వివరించారు. -
సీ లింక్ మీదుగా ఉచిత రాకపోకలు
సాక్షి, ముంబై: బాంద్రా-వర్లీ సీ లింకు మీదుగా కార్పొరేటర్లు ఉచితంగా రాకపోకలు సాగించేందుకు మేయర్ సునీల్ ప్రభు సౌకర్యం కల్పించారు. మేయర్ పదవీ కాలం సెప్టెంబర్ 9వ తేదీన ముగియనుంది. తాను పదవిలో ఉండగా కార్పొరేటర్లకు మేలు చేయాలని సంకల్పించారు. అందుకు బీఎంసీ సమావేశ మందిరంలో బుధవారం జరిగిన చివరి సమావేశంలో ఈ శుభవార్త వెల్లడించారు. బీఎంసీలో మొత్తం 227 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఇందులో అనేకమంది బాంద్రా-వర్లీ సీ లింకు మీదుగా రాకపోకలు సాగిస్తుంటారు. కానీ అక్కడ ఏర్పాటు చేసిన టోల్ ప్లాజా వద్ద జేబులోంచి డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. ఈ విషయాన్ని కార్పొరేటర్లు పలుమార్లు మేయర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సంబంధిత ప్రభుత్వాధికారులతో మేయర్ చర్చించారు. ఎట్టకేలకు కార్పొరేటర్లకు సీలింకు మీదుగా ఉచితంగా రాకపోకలు సాగించేందుకు అనుమతి లభించింది. కార్పొరేటర్ వాహనానికి ఒక ట్యాగ్ ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా బాంద్రా సీ లింకు మీదుగా ఎన్నిసార్లైనా రాకపోకలు సాగించేందుకు వీలు లభించనుందని మేయర్ తెలిపారు. బోరివలిలోని నేషనల్ పార్క్‌లోనికి వెళ్లాలంటే అక్కడి సిబ్బంది కార్పొరేటర్ల నుంచి పన్ను వసూలు చేస్తున్నారు. ఇక నుంచి అది కూడా చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇందుకు మేయర్‌కు కొర్పొరేటర్లు ప్రశంసలతో ముంచెత్తారు. అభినందనలు తెలియజేశారు. -
వానలొచ్చినా.. నో ప్రాబ్లం..!
సాక్షి, ముంబై: వర్షాకాలం సమీపించడంతో మహానగర పాలక సంస్థ (బీఎంసీ) సన్నద్ధమైంది. మురికివాడలు, నాలాలు, రహదారులపై పేరుకుపోయిన చెత్తాచెదారం తొలగింపు పనులు దాదాపు 85 శాతం పూర్తి కావచ్చాయని మేయర్ సునీల్ ప్రభు చెప్పారు. మిగతా 15 శాతం పనులు త్వరలో పూర్తిచేయాలని ఆదేశించారు. జూన్ ఏడో తేదీ నుంచి వర్షాకాలం ప్రారంభమవుతుంది. దీంతో సాధ్యమైనంత త్వరగా మిగిలిపోయిన పనులు పూర్తిచేయాలని బీఎంసీ పారిశుద్ధ్య శాఖ అధికారులను, సంబంధిత కాంట్రాక్టర్లకు ఆదేశించారు. ఎమ్మెమ్మార్డీయే, మాడా, నేవీ, మిలటరీ, రైల్వే తదితర పరిపాలన విభాగాలతో చర్చించారు. వారి ఆధీనంలో ఉన్న పనులు, వర్షాకాలానికి ముందు చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఆరా తీశారు. అదేవిధంగా రోడ్లు, నాలాలు, ఆరోగ్యశాఖ అధికారులతో చర్చించారు. వర్షా కాలంలో వివిధ ప్రాంతాల్లోని వర్షపాతం నమోదు చేసేందుకు 65 చోట్ల యంత్రాలు ఏర్పాటుచేశారు. 2005లో నగరంలో వరదలు రావడానికి ప్రధాన కారణమైన మిఠీనదిని కూడా శుభ్రం చేసే పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. ఈ నదికి ఇరువైపుల అక్రమంగా అనేక గుడిసెలు వెలిశాయి. వర్షా కాలంలో నదికి వరదలు వచ్చే ప్రమాదం ఉండడంతో వాటిని వెంటనే ఖాళీచేయాలని హెచ్చరికలు జారీచేశారు. అంటువ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య శాఖకు సూచించారు. గతంలో వర్షాకాలంలో ఎక్కడెక్కడ నీరు నిలిచేది.. మలేరియా, డెంగీ వంటి అంటువ్యాధులు ఎంతమందికి సోకాయి.. తదితర వివరాలు ఎప్పటికప్పుడు వెబ్సైట్లో ఉంచుతున్నామని ప్రభు అన్నారు. ముఖ్యంగా వర్షాకాలం వచ్చిందంటే పాత భవనాల్లో ఉంటున్న పేద కుటుంబాల్లో ఆందోళన మొదలవుతుంది. ఎప్పుడు, ఎలాంటి ప్రమాదం జరిగినా వెంటనే సంఘటన స్థలానికి అవసరమైన పరికరాలతో చేరుకునేలా సిద్ధంగా ఉండాలని అగ్నిమాపక శాఖకు సూచించారు. అందుకు అగ్నిమాపక శాఖకు చెందిన ఆరు కమాండింగ్ సెంటర్లను ప్రత్యేకంగా నెలకొల్పారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన సామగ్రిని కూడా సమకూర్చారు. నగరంలో కీలకమైన ఆరు సముద్ర తీరాల వద్ద 51 మంది లైఫ్ గార్డులను నియమించారు. -
రెండు ఫుట్‌బాల్ మైదానాల అభివృద్ధి
సాక్షి, ముంబై: నగరవాసుల కోసం రెండు ఫుట్‌బాల్ మైదానాలను అభివృద్ధి చేయాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నిర్ణయించింది. నెదర్లాండ్స్‌కు చెందిన ‘జాన్ క్రేఫ్ ఫౌండేషన్’ వారి భాగస్వామ్యంతో ఈ రెండు చిన్న ఫుట్‌బాల్ మైదానాలను అందుబాటులోకి తీసుకురానుంది. ఇటీవల జెఫర్వోన్తో జరిగిన సమావేశంలో నగర మేయర్ సునీల్ ప్రభు ఈ మైదానాలను అభివృద్ధి చేసే అంశాన్ని చర్చించారు. ‘ఈ ఫౌండేషన్ ప్రపంచంలోనే వివిధ నగరాలలో చాలా మైదానాలను అభివృద్ది చేసింది. నిరుపేదలైన ఏడు నుంచి 14 ఏళ్లలోపు పిల్లలకు అన్ని వసతులతో కూడిన ఆట మైదానాలను అందుబాటులో ఉంచుతాం. వారు క్రీడల్లో రాణించేలా ప్రోత్సహించడమే తమ లక్ష్యమ’ని మేయర్ సునీల్ ప్రభు పేర్కొన్నారు. ఈ మైదానాలు అభివృద్ధి అయిన తర్వాత ఫౌండేషన్ ద్వారా ఈ మైదానాల చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల పేద పిల్లలకు ఉచితంగా కోచింగ్ కూడా ఇచ్చే ఏర్పాట్లు చేస్తామని ఆయన తెలిపారు. కాగా, బీఎంసీ పరేల్‌లో ఉన్న సెయింట్ జేవియర్స్ మైదానం, పశ్చిమ బాంద్రాలోని పీ సెవెన్ మైదానాలను ఫుట్‌బాల్ మైదానాలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ మైదానాలకు క్రేఫ్ కోర్టులుగా నామకరణం చేస్తామని బీఎంసీ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఆట మైదానాలను అభివృద్ధి చేసి, వీటి నిర్వహణ బాధ్యతను కూడా ఆ ఫౌండేషన్‌కు కార్పొరేషన్ అప్పగించనుందని తెలిపారు.ఈ తరహా మరిన్ని మైదానాలను నగర శివారు ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేయనుందని ఆయన వివరించారు. -
నన్నెందుకు పిలవలేదు ?
ముంబై: అంతర్జాతీయ విమానాశ్రయంలోని రెండో టెర్మినల్ ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముంబై మేయర్ సునీల్ ప్రభు ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు లేఖాస్త్రం సంధించారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవం కోసం ముద్రించిన ఆహ్వానపత్రికలో తన పేరు లేకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ ఆయన లేఖ రాశారు. ‘మేయర్‌ను అవమానించే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ముంబైకర్ల తరఫున నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది నాకు, నగరవాసులందరికీ అవమానం. ప్రొటోకాల్ ప్రకారం వీవీఐపీలు, దౌత్యవేత్తలు నగరానికి వచ్చినప్పుడు మేయర్ వారికి స్వాగతం, వీడ్కోలు పలకాలి. ప్రారంభోత్సవాల్లో మేయర్‌కు కేబినెట్ మంత్రి హోదా ఉంటుంది’ అని సునీల్ ప్రభు లేఖలో పేర్కొన్నారు.ప్రస్తుత పరిణామం మేయర్ పదవికే అవమానమని ఆయన వ్యాఖ్యానించారు. -
ముంబై భవనం కూలిన ఘటనలో బీఎంసీ అధికారులు అరెస్ట్
ముంబై నగరంలో మాజ్‌గావ్ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున నాలుగంతస్థుల భవనం కుప్పకూలిన ఘటనను మహారాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఆ ఘటనకు బాధ్యులుగా భావిస్తూ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) చెందిన ముగ్గురు ఉన్నతాధికారులను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 33 ఏళ్ల క్రితం కట్టిన ఆ భవనం శిథిలావస్థలో ఉందని, నివాసిస్తున్న కుటుంబాలను ఖాళీ చేయించి ఆ భవనానికి మరమ్మతులు నిర్వహించాలని ఇటీవల తనిఖీలకు వెళ్లిన బీఎంసీ అధికారులు ఆ భవన యజమానిని ఆదేశించించారు. అయితే యజమాని బీఎంసీ అధికారుల ఆదేశాలను భేఖాతరు చేశాడు. అదికాక భవన కింద సెల్లార్లో ఓ సంస్థకు యజమాని అద్దెకు ఇచ్చాడు. దాంతో సెల్లారులో మరమత్తులు నిర్వహించాడు. ప్రమాదం జరిగేందుకు అవి కూడా కారణమని మున్సిఫల్ అధికారులు భావిస్తున్నారు. అయితే భవనం కూలడానికి బీఎంసీ అధికారుల ఉదాసీనతే కారణమని ప్రభుత్వం భావించింది. దాంతో ముగ్గురు ఉన్నతాధికారులను అరెస్ట్ చేశారు. అయితే భవనం కుప్పకూలిన ఘటనలో మరణించిన ఒక్కో కుటుంబానికి రూ. లక్ష పరిహారాన్ని మహారాష్ట్ర సీఎం పృద్దీరాజ్ చవాన్ ఇప్పటికే ప్రకటించారు. అలాగే ఒకొక్క మృతుని కుటుంబానికి రూ.2 ఇస్తున్నట్లు ముంబై నగర మేయర్ సునీల్ ప్రభు వెల్లడించిన సంగతి తెలిసిందే.