సాక్షి, ముంబై: బాంద్రా-వర్లీ సీ లింకు మీదుగా కార్పొరేటర్లు ఉచితంగా రాకపోకలు సాగించేందుకు మేయర్ సునీల్ ప్రభు సౌకర్యం కల్పించారు. మేయర్ పదవీ కాలం సెప్టెంబర్ 9వ తేదీన ముగియనుంది. తాను పదవిలో ఉండగా కార్పొరేటర్లకు మేలు చేయాలని సంకల్పించారు. అందుకు బీఎంసీ సమావేశ మందిరంలో బుధవారం జరిగిన చివరి సమావేశంలో ఈ శుభవార్త వెల్లడించారు. బీఎంసీలో మొత్తం 227 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఇందులో అనేకమంది బాంద్రా-వర్లీ సీ లింకు మీదుగా రాకపోకలు సాగిస్తుంటారు.
కానీ అక్కడ ఏర్పాటు చేసిన టోల్ ప్లాజా వద్ద జేబులోంచి డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. ఈ విషయాన్ని కార్పొరేటర్లు పలుమార్లు మేయర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సంబంధిత ప్రభుత్వాధికారులతో మేయర్ చర్చించారు. ఎట్టకేలకు కార్పొరేటర్లకు సీలింకు మీదుగా ఉచితంగా రాకపోకలు సాగించేందుకు అనుమతి లభించింది. కార్పొరేటర్ వాహనానికి ఒక ట్యాగ్ ఏర్పాటు చేస్తారు.
దీని ద్వారా బాంద్రా సీ లింకు మీదుగా ఎన్నిసార్లైనా రాకపోకలు సాగించేందుకు వీలు లభించనుందని మేయర్ తెలిపారు. బోరివలిలోని నేషనల్ పార్క్‌లోనికి వెళ్లాలంటే అక్కడి సిబ్బంది కార్పొరేటర్ల నుంచి పన్ను వసూలు చేస్తున్నారు. ఇక నుంచి అది కూడా చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇందుకు మేయర్‌కు కొర్పొరేటర్లు ప్రశంసలతో ముంచెత్తారు. అభినందనలు తెలియజేశారు.
సీ లింక్ మీదుగా ఉచిత రాకపోకలు
Published Thu, Aug 28 2014 11:10 PM | Last Updated on Sat, Sep 2 2017 12:35 PM
Advertisement
Advertisement